రవీంద్రభారతి, హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నవలా సాహిత్యాన్ని అభివృద్ధి పరచడానికి సాహిత్య అకాడమీ కృషి చేస్తోందని, అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో నవలా రచనలు ప్రోత్సహించాలని నవలా రచన పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు పంపే పుస్తకాలు వంద పేజీలు తగ్గకుండా, రెండు వందల పేజీలు మించకుండా ఉండాలని, తెలంగాణ జీవన విధానం ఉట్టిపడేలా ఉండాలన్నారు. ఈ పోటీలకు సెప్టెంబర్‌ 10వ తేదీలోపు కార్యదర్శి తెలంగాణ సాహిత్య అకాడమీ, రవీంద్రభారతి, కళాభవన్‌, సైఫాబాద్‌, హైదరాబాద్‌- చిరునామాకు నవలలను పంపించాలని కోరారు. మెదటి బహుమతి లక్ష రూపాయలు, రెండో బహుమతి డెబ్బై ఐదు వేలు, మూడో బహుమతి యాభై వేలు రూపాయలు అందజేయనున్నట్లు నందిని సిధారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమి కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు.