యురేనియం తవ్వకాలపై గోరటి వెంకన్న పాట..

‘సమాఖ్య’ ఏకమవ్వడమే రామారావుకు నివాళి: తమ్మారెడ్డి

తెలంగాణ ఆత్మ గౌరవ గొంతుక విమలక్క: కె.శ్రీనివాస్‌

విమలక్కకు అరుణోదయ రామారావు పురస్కారం ప్రదానం

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ‘‘పరమ శివుడా.. నిన్ను నువ్వే కాపాడుకో’’ అంటూ నల్లమలలో యురేనియం తవ్వకాలను ఉద్దేశించి ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న గీతాన్ని ఆలపించారు. త్యాగరాయ గానసభలో ‘శంకరం వేదిక సాహిత్య, సాంస్కృతిక సంస్థ’ ఆధ్వర్యంలో అరుణోదయ రామారావు తొలి స్మారక పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గోరటి వెంకన్న, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ తదితరుల చేతుల మీదుగా ప్రజా గాయని విమలక్క ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తుది వరకూ ప్రజా కళాకారుడిగా కొనసాగిన అరుదైన వ్యక్తి అరుణోదయ రామారావు అని అన్నారు.

 

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. మూడుగా చీలిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఒక్కటి కావడమే రామారావుకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మ గౌరవానికి, స్త్రీ సాధికారతకు చెందిన గొంతుక విమలక్క అని అభివర్ణించారు. అరుణోదయ రామారావు పాటకు కొనసాగింపే విమలకు ఆయన స్మారక పురస్కారాన్ని ప్రదానం చేయడం అని అభిప్రాయపడ్డారు. తన విద్యార్థి దశలో ఆరాధనగా చెప్పుకొనే లెజెండ్స్‌లో రామారావు ఒకరని.. ఆయన పాట కోసమే తాను ఎన్నో సమావేశాలకు వెళ్లానని చెప్పారు. ఆయనను చివరిసారిగా కలిసినప్పుడు.. దేశంలో మతతత్వం క్రమంగా బలపడి, ఒక నాటి జర్మనీలో హిట్లర్‌ స్థాపించిన సమాజం భారత్‌లో కూడా వస్తుందేమోననే ఆందోళన వ్యక్తం చేశారని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో రామారావు సహచరి అరుణ, అరుణోదయ వ్యవస్థాపక సభ్యుడు చలపతిరావు, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.