రవీంద్రభారతి, డిసెంబర్‌ 3 (ఆంధ్రజ్యోతి): రచయిత్రి డా.వాణి దేవులపల్లి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతి వ్యాసంలో పొందుపరిచారని వక్తలు అన్నారు. సోమవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి డా.వాణి దేవులపల్లి రచించిన అస్తిత్వ పరిమళాలు పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రిని అభినందించారు. తెలంగాణ ఉద్యమం అంటే 2001 నుంచే జరిగిందని చాలా మంది అనుకుంటారని 1969 తర్వాత 89, 96లో ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. మన చరిత్రను మనం లిఖించుకోవాలన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వంపై లోతైన పరిశీలన, సహృదయత, చక్కటి అవగాహనతో రచించారని అన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ పుస్తకంలోని ప్రతి వ్యాసం ఒక పువ్వులా పేర్చి పరిమళాలను పంచారని అన్నారు. స్త్రీ, తెలంగాణ అస్తిత్వాలను వివరించారని అన్నారు.  ఆచార్య బన్న ఐలయ్య సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌.రాములు ముదిగంటి సుజతారెడ్డి, ప్రభాకర్‌ జైని, కొండపల్లి నిహారిణి తదితరులు పాల్గొన్నారు.