హైదరాబాద్‌ సిటీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత్రి, పద సాహిత్య పరిశోధనలో విశేష కృషి చేసిన డాక్టర్‌ మంగళగిరి ప్రమీలాదేవి (75) కన్నుమూశారు. మల్కాజ్‌గిరిలోని స్వగృహంలో గురువారం ఆమె గుండెపోటుతో మృతిచెందారు. తెలుగు, సంస్కృత, హిందీ భాషల్లో ప్రావీణ్యమున్న ప్రమీలాదేవి 40 పుస్తకాలు రచించారు. స్వయంగా ఆమె ‘‘పద సాహిత్య పరిషత్‌’’ను నెలకొల్పారు. ఆమె రాసిన ‘‘తెలుగు పద్య గేయ నాటికలు’’ గ్రంథానికి 1971లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. గతేడాది ఏపీ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం సాయంత్రమే పటేల్‌నగర్‌ శ్మశానవాటికలో ప్రమీలాదేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌.. ప్రమీలాదేవి మృతికి సంతాపం వ్యక్తంచేశారు. ప్రముఖ రచయిత్రులు ముక్తేవి భారతి, తమిరిశ జానకి తదితరులు నివాళులర్పించారు.