రవీంద్రభారతి, హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): సినిమా, టీవీ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారిని గుర్తించి సత్కరించడం అభినందనీయమని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు.గురువారం రవీంద్రభారతిలో యువకళావాహిని ఫిల్మ్‌ ఎక్సలెన్సీ, టీవీ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి (న్యూస్‌ రూం)కు ఉత్తమ ఫీచర్స్‌ అవార్డు లభించింది. ఫిల్మ్‌ ఎక్స్‌లెన్సీ అవార్డులకు హీరో సుమన్‌, దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, నిర్మాత రాజ్‌ కందుకూరి, రచయిత తోటపల్లి సాయినాథ్‌, ఛాయాగ్రాహకుడు చోటా కె.నాయుడు, సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్‌ ఎంపికయ్యారు. టీవీ రంగంలో ఉత్తమ నటీనటులుగా పల్లవి, నిరుపమ్‌లతో పాటు పలువురికి ఈ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య, ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌, రాజయ్య, రామకృష్ణ, మహ్మద్‌ రఫీ, వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొని పురస్కారగ్రహీతలను అభినందించారు. సభకు ముందు ప్రముఖ గాయని ఆమని నేతృత్వంలో సంగీత విభావరి నిర్వహించారు.