మలిదశ ఉద్యమానికి ఆయన పాట స్ఫూర్తి: బాల్క సుమన్‌

కోడూరి విజయకుమార్‌కు మల్లావఝల పురస్కారం

రవీంద్రభారతి/హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వేదనను తన పాటల ద్వారా వినిపించిన ప్రజాకవి మల్లావఝల సదాశివుడి స్ఫూర్తి శాశ్వతంగా మనతోనే ఉంటుందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. ఆయన రాసిన ‘తలాపున పారుతోంది గోదారి..’ అనే పాట మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ వికాస సమితి, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారాన్ని ప్రముఖ కవి, రచయిత, కథకుడు కోడూరి విజయకుమార్‌కు ప్రదానం చేశారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్‌ సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి అతిథులుగా బాల్క సుమన్‌తోపాటు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ కె.సీతారామారావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కవి నారాయణశర్మ, కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్‌ తదితరులు హాజరై విజయకుమార్‌ను సత్కరించి పురస్కారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ తెలంగాణ గర్వించదగిన కవి సదాశివుడు అని కీర్తించారు. కోడూరి విజయకుమార్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యం సదాశివుడని అన్నారు. వలస జీవితాలను వివరిస్తూ ‘ఏమున్నదక్కో...’ అనే పాట రాశారని గుర్తుచేశారు. అయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ ఆంధ్ర పాలకులు చేసిన దోపిడీని ప్రజలకు వివరించిన ఘనత సదాశివుడిదని అన్నారు. దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ పాట గొప్పదని.. అన్ని రసాలు పలికించగల శక్తి తెలంగాణకు ఉన్నదని చెప్పారు. సదాశివుడి పేరిట పురస్కారాన్ని ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోడూరికు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.