చెన్నై, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా సంబేపల్లికి చెందిన తెలుగు కథా రచయిత వేంపల్లి రెడ్డినాగరాజు దక్షిణ భారత హిందీ ప్రచార సభ సాహిత్య పురస్కారం అందుకున్నారు. చెన్నైలో శనివారం జరిగిన హిందీ ప్రచార సభ 82వ స్నాతకోత్సవంలో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. హిందీ ప్రచార సభ అధక్షుడు జస్టిస్‌ శివరాజ్‌ వి.పాటిల్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ... దేశభాషగా గుర్తించేందుకు హిందీకి అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. సాహిత్య పురస్కారాలు అందుకున్న రచయితలను అభినందించారు. కాగా, వేంపల్లి రెడ్డి నాగరాజు చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి సహా పలు పత్రికలలో పనిచేశారు. కడప జిల్లాలో ఆయన బాల సాహిత్యకారుడిగా సుపరిచితుడు.