రవీంద్రభారతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): శ్రీకళానికేతన్‌ హైదరాబాద్‌ 54వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ నాటక, నవలా రచయిత ఆదివిష్ణు, సూర్య మహాలక్ష్మికి కళానికేతన్‌ రంగస్థల పురస్కారం అందజేశారు. మంగళవారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో కళానికేతన్‌ ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ దినోత్సవం నిర్వహించారు. పురస్కార గ్రహీతలు ఆదివిష్ణు, సూర్య మహాలక్ష్మిని అతిథిగా హాజరైన రమణాచారి అభినందించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి ఆదివిష్ణు సేవలు ఎనలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ బి.శివకుమార్‌, సాహితీవేత్తలు పత్తిపాక మోహన్‌, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, దైవజ్ఞశర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సభకు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.