ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ సహా పలువురికి అభినందన

చిక్కడపల్లి, హైదరాబాద్, ఆగస్టు7(ఆంధ్రజ్యోతి): శంకరం వేదిక సాహితీ సాంస్కృతిక సంస్థ అప్పికట్ల,హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఉద్యమకలాలకు సత్కార కార్యక్రమం ఆగస్టు 11న త్యాగరాయ గానసభలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత యలవర్తి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నాటి తెలంగాణ సాయుధ పోరాటంనుంచి నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఎందరో సాహిత్యకారులు, కళాకారులు, గేయకర్తలు, వ్యాసకర్తలు తమ పదునైన అక్షరాలతో ప్రభంజనాలు సృష్టిస్తూ వచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమ సాధనకోసం ఎంతో కృషి చేసి ప్రజలను చైతన్యవంతులుగా చేసిన కొందరు మేధావులకు ఉద్యమకలాలు పేరిట సత్కారం చేయడం శంకరం వేదిక తన బాధ్యతగా భావిస్తోందన్నారు. అందులో భాగంగా ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె శ్రీనివాస్‌, తెలంగాణ మీడియా అకాడమీ చైౖర్మన్‌ అల్లం నారాయణతోపాటు పలువురిని సత్కరిస్తున్నట్లు వెల్లడించారు.ముఖ్యఅతిథులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్‌ సిరికొండమధుసూదనాచారి, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ఛైర్మన్‌ ప్రొ. ఘంటా చక్రపాణి, తెలంగాణబీసీ కమిషన్‌ సభ్యులు జూలూరు గౌరీశంకర్‌, తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ డా.ఆయాచితం శ్రీధర్‌ తదితరులు పాల్గొంటారని వివరించారు.