రవీంద్రభారతి, హైదరాబాద్, మే 11(ఆంధ్రజ్యోతి):తెలంగాణ రాష్ట్రంలో తెలుగును వెలిగించడంతో బంగారు తెలంగాణ స్వప్నం సాకారం అవుతుందనే నేపథ్యంతో సాగిన బంగారు తెలంగాణ నాటకం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలుగు తప్పనిసరి విధానం ఇతివృత్తంగా ఈ నాటకం కొనసాగింది. శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఫైన్‌ ఆర్ట్స్‌ ఫిలింస్‌ క్రియేటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ నాటకాన్ని ప్రదర్శించారు. చుక్క జితేందర్‌ రచన, దర్శకత్వం వహించిన ఈ నాటకం ఆహూతుల్ని ఆకట్టుకుంది. రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలు, విధి విధానాలను చూపిస్తూ సాగిన ఈ నాటకం ప్రేక్షకులను రంజింపజేసింది. తెలుగు నేర్పించేందుకు రిటైర్డ్‌ తెలుగు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలనే సూచనను ఈ నాటకం ద్వారా దర్శకుడు ప్రయత్నించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాషా సాంస్కతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ హాజరై కళాకారులను అభినందించారు.