హైదరాబాద్‌సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఒక సమస్యపై స్పందించే పద్ధతుల్లో విమర్శ, వ్యంగ్యం రెండూ కలగలిపి ప్రయోగించే కార్టూన్‌ విషయంలో నేటి పత్రికలు వెనుకంజ వేస్తున్నాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. శనివారం జరిగిన ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఉత్తమ కార్టూనిస్ట్‌ అవా ర్డు గ్రహీత నర్సింహ అభినందన సభలో ఆయన ‘రాజకీయాలు-పత్రికల్లో రాజకీయ కార్టూన్లు’ అనే అంశంపై మాట్లాడారు. మామూలు కార్టూన్లకు, రాజకీయ కార్టూన్లకు తేడా ఉంటుందన్నారు. పత్రికల్లో ధైర్యంగా రాజకీయ కార్టూన్లు వేసిన కార్టూనిస్టులు జైలుపాలయిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. నర్సింహ కేవలం కార్టూనిస్టే కాకుండా క్యారికేచర్‌ ఆర్టిస్టు కావ డం గొప్పవిషయమన్నారు. అవార్డు గ్రహీత నర్శింహ మాట్లాడుతూ బాల కార్మికుడిగా జీవితం ప్రారంభించినా..చివరికి కార్టూనిస్టుగా స్ధిరపడ్డానన్నారు. కార్టూన్‌లకు కూడా ప్రాముఖ్యముందని ఈ అవార్డు నిరూపించిందన్నారు. నేటి జర్నలిజంలో కార్టూన్‌ స్ధానం చాలా ముఖ్యమైనదన్నారు. కార్టూన్‌లకు పూర్వవైభవం తీసుకొని రావల్సిందిగా కోరారు. కార్టూనిస్టులు అవుదామనుకునే వారికి సరైన ప్రోత్సాహం లేనికారణంగా తరువాతి తరంలో కార్టూనిస్టులు లేకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టులు కే.శ్రీనివాసరెడ్డి, కట్టా శేఖర్‌రెడ్డి, ఎస్‌ వీరయ్య తదితరులు పాల్గొన్నారు