తెనాలి, 09-09-2018: టీవీలు, సమాజానికి కీడుచేసే కథలు, బ్లూవేల్‌ తదితర ప్రమాదకర క్రీడలు నిజమైన సంస్కృతి కాదని శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. సినీ రచయిత, అభ్యుదయవాది బొల్లిముంత శివరామకృష్ణ స్మారక సాహితీ, సాంస్కృతిక ఉత్సవాలు-2018లో భాగంగా బొల్లిముంత జీవిత సాఫల్య పురస్కార ప్రదానం శనివారం గుంటూ రు జిల్లా తెనాలిలో జరిగింది. కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు.. ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్‌కు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ మనుషులు మారాలి, శారద వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు మాటలు రాసిన బొల్లిముంత వంటి అభ్యుదయవాది, సోషలిస్టు గాంధీగా పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పురస్కార గ్రహీత బుద్దప్రసాద్‌ మట్లాడుతూ బొల్లిముంత వంటి గొప్పవ్యక్తి పురస్కారానికి తాను అర్హుడిని కాకున్నా, తనను ఎంపికచేయటం గర్వంగా ఉందన్నారు.