రవీంద్రభారతి, హైదరాబాద్, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి) : తెలంగాణను సాహిత్యవనంగా తయారుచేస్తామని ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సాహితీ సదస్సులు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. గురువారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఔత్సాహిక కవులు, రచయితలకు రెండు రోజుల శిక్షణాన్ని శిబిరాన్ని బుర్రా వెంకటేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవీంద్రభారతిలో కాన్ఫరెన్స్‌ హాళ్లను సాహిత్య అకాడమీకి కేటాయిస్తామని అన్నారు. అందులో 16మంది సాహితీమూర్తుల చిత్రపటాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ పద్యం, కవిత్వం హృదయాలకు చేరితేనే సఫలీకృతమైనట్లన్నారు. అనంతరం ప్రముఖ సాహితీవేత్తలు అనుమాండ్ల భూమయ్య-పద్య రచన, వడ్డేపల్లి- గేయ రచన, ఆచార్య బన్న ఐలయ్య - వచన కవిత్వం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి- కవిత్వం-శిల్పం, ముక్తవరం పార్ధసారథి- విశ్వసాహిత్యంలో కథ, ముదిగంటి సుజాతారెడ్డి-తెలంగాణ కథా పరిణామం, బి.వి.ఎన్‌.స్వామి- కథ రచన శిల్పం, పెద్దింటి అశోక్‌కుమార్‌- కథా వస్తువు అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు.