నేడు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి తొలి వర్ధంతి

హన్మాజీపేటలో స్మృతివనం నిర్మాణం పూర్తి

సిరిసిల్ల, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కవిత్వమే శ్వాసగా.. కవిత్వమే భాషగా.. కవిత్వమే తన చిరునామాగా కళామతల్లి సేవలో తరించిన అక్షరహాలికుడు సినారె! ‘రాస్తూ రాస్తూ పోతాను.. సిరా ఇంకే వరకు! పోతూ పోతూ రాస్తాను.. వపువు వాడేవరకు’ అంటూ కడవరకు తెలుగు సాహితీ పరిమళాలను ప్రపంచానికి చాటిచెప్పిన జ్ఞానపీఠం ఆయన!! మంగళవారం డాక్టర్‌ సి.నారాయణరెడ్డి తొలి వర్ధంతి. ఆ మహానుభావుడి స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హన్మాజీపేటలో కవులు అక్షర నివాళులర్పించేందుకు కలాలను కదిలిస్తున్నారు.
 
భౌతికంగా ఆ ‘విశ్వంభరుడు’ లేకపోయినా.. ప్రతి సాహిత్యకారుడి గుండెల్లో నిలువెత్తు రూపమై పదిలంగానే ఉంటారని ఆయన అభిమానులు యాదికి తెచ్చుకుంటున్నారు. సినారె వర్ధంతి సందర్భంగా మంగళవారరం హన్మాజీపేటలో కవులు, రచయితలు, కళాకారులు, సాహిత్యభిమానులు సమావేశం కానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినారె కుటుంబసభ్యులు హన్మాజీపేటలోని ఇంటి ఆవరణలో స్మృతివనం ఏర్పాటు చేశారు. ప్రముఖ చిత్రకారుడు రమణారెడ్డి ఇచ్చిన ఆకృతి మేరకు ఈ స్మృతివనాన్ని నిర్మించారు. ఇక్కడే సినారె మునిమనుమరాలు వరేణ్యరెడ్డి పుస్తకావిష్కరణ జరగనుంది. వరేణ్య ఆంగ్లంలో రచించిన గ్రంథాన్ని తెలుగులో డాక్టర్‌ జె.చెన్నయ్య ‘ఇతిహాస పాత్రల్లో మరో కోణం’ పేరుతో తెలుగులోకి అనువదిచారు.