విశ్వంభరుడికి హన్మాజీపేటలో స్మృతివనం..

కవనభూమిగా నామకరణం..

కవులు, రచయితల మధ్య ప్రథమ వర్థంతి

సిరిసిల్ల, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): గాలికి కులమేది? ఏదీ.. నీటికి కులమేది? అని ప్రశ్నించిన మానవతావాది ఆయన! కంటేనే అమ్మ అని అంటే ఎలా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా? అని మాతృత్వ మాధుర్యానికి ఎల్లలు లేవని చెప్పిన కవి! కవితా జగత్తులో ఆయన సవ్యసాచి! తడి ఇసుకన గీసిన గీతలు అల తాకితే మాసిపోతాయి.. ఆయన రాసిన కవితలు బతుకంతా ఉండిపోతాయి!! ఆయన కవితా సుగంధం.. ఎన్ని యుగాలైనా ఇగిరిపోని గంధం! పద్య కవిగా, రచయితగా, సినీకవిగా.. కీర్తికి చిహ్నంగా ఆయన స్వస్థలంలో ‘కవనభూమి’ కొలువైంది! జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి ప్రథమ వర్థంతిని ఆయన స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినారె కూతుళ్లు, బంధువులు, కవులు, రచయితలు విచ్చేశారు.

అక్కడ సినారె స్మృతివనాన్ని ప్రారంభించి.. దానికి ‘కవనభూమి’గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సినారెకు కవులు, రచయితలు.. కవిత్వాలు, పాటల ద్వారా నీరాజనాలు పలికారు.సినారె మునిమనువరాలు ఆంగ్లంలో రచించిన గ్రంథాన్ని తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చెన్నయ్య ‘ఇతిహస పాత్రలు.. మరోకోణం’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. గులేబకావళి కథ, ఏకవీర చిత్రాలకు సినారె రాసిన మాటలను పుస్తక రూపంలో అందిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. జిల్లా కేంద్రంలో గాంధీచౌక్‌ వద్ద జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అభిమానులు.. సినారె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అఖిల భారత తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, ఎన్‌బీటీ సంపాదకుడు డాక్టర్‌ పత్తిపాక మోహన్‌, సినారె కూతుళ్లు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి, రంగినేని ట్రస్ట్‌ అధ్యక్షుడు రంగినేని మోహన్‌రావు, కవులు, రచయితలు వడ్డెపల్లి సంధ్య, డాక్టర్‌ వాసరవేణి పర్శరాములు, డాక్టర్‌ జనపాల శంకరయ్య, ఆడెపు లక్ష్మణ్‌, జిందం రవి, జక్కని వెంకట్రాజం, సంకెపల్లి నాగేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.