కాప్రా, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని త్రిదండి చిన జీయర్‌ స్వామి అన్నారు. కాప్రా సర్కిల్‌ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని శ్రీరంగగిరిలో శ్రీ గోదాతాయారు రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన ఎదుర్కోలు ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. దైవం, ప్రేమ ఒకటేనని, ద్వేషం వీడి ప్రేమను పంచాలన్నారు.  దేవుడు ఎక్కడో లేడని మన హృదయ మందిరంలోనే కొలువై ఉంటారన్నారు. సృష్టి ఆరంభంలో శ్రీరంగనాథుడు  వివిధ అవతారాలు ఎత్తి శ్రీరంగపురానికి వేంచేశాడన్నారు. అక్కడి నుంచి ఈ శ్రీరంగ గిరికి విచ్చేసి అందరికి మరింత చేరువయ్యాడన్నారు.

శ్రీ గోదాతాయారు రంగనాథ స్వామి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తున్న ఆలయ చైర్మన్‌ డాక్టర్‌ ధనుంజయను ఆయన అభినందించారు. ఆలయంలో గాలిగోపురాన్ని కూడా నిర్మించాలని ఆయన సూచించారు. శ్రీరామానుజ సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కందాడై రామానుజాచార్య స్వామి, జ్వాలా నరసింహారావు, జస్టిస్‌ బి.మధుసూదన్‌, ఎస్‌వీబీసీ కన్వీనర్‌ రామలక్ష్మి, కార్పొరేటర్‌ గొల్లూరి అంజయ్య, ఆలయ చైర్మన్‌ డాక్టర్‌ ధనుంజయ, రమ, రామకృష్ణ, టి.కె.చూడామణి తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.