రవీంద్రభారతి, అక్టోబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని జానపద కళాకారులకు నగదు పురస్కారాలు అందజేసి వారికి అండగా నిలబడడం అభినందనీయమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. గురువారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో కళాబంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేద కళాకారులకు నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు పది మందికి రూ.10వేల చొప్పున అందజేసి సత్కరించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణాచారి అవార్డులు అందజేసిన సారిపల్లి కొండలరావును అభినందించారు. కళపై ఆధారపడి అవకాశాలు రాలేకపోయినవారికి నగదు పురస్కారాలు కొంత బాసటగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వంతో పాటు సంస్థలు కూడా కళాకారులకు అండగా నిలబడితే కళలకు మనుగడ ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ బి.ఎస్‌.రాములు, సారిపల్లి కొండలరావు, పాలకుర్తి మధుసూదనరావు, మంగళగిరి ఆదిత్యప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొని కళాకారులను సన్మానించారు.