ఆయనకు వందశాతం అర్హత ఉంది

కేంద్ర మంత్రి సదానందగౌడ వెల్లడి

హంసలేఖకు ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం

బెంగళూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సినీరంగంలో దిగ్గజంగా వెలుగొంది రాజకీయాల్లోనూ అద్భుతంగా రాణించిన దివంగత నందమూరి తారక రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న పొందే అర్హత నూటికి నూరుశాతం ఉందని కేంద్రమంత్రి డి.వి.సదానందగౌడ పేర్కొన్నారు. బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రలో శుక్రవారం కర్ణాటక తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2018 సంవత్సరానికిగాను ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు డాక్టర్‌ హంసలేఖకు అందజేసి సత్కరించారు.

ఈ సందర్భంగా సదానంద మాట్లాడుతూ... ఎన్టీఆర్‌కు ఇప్పటికే భారతరత్న లభించి ఉండాల్సిందన్నారు. ఈ అంశం పై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానన్నారు. పీఈఎస్‌ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎం.ఆర్‌.దొరస్వామి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మునిరత్న, కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు ఆర్‌.వి.హరీష్‌, ప్రధానకార్యదర్శి సి.వి.శ్రీనివాసయ్య, కార్యాధ్యక్షుడు ఉమాపతి నాయుడు, నగర తెలుగు ప్రముఖులు ఆదికేశవులు నాయుడు, వెంకటస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీఆర్‌ నటించిన సినిమాల్లోని గీతాలను జూనియర్‌ ఘంటసాలగా పేరొందిన శివప్రసాద్‌ బృందం ఆలపించింది.