వనస్థలిపురం, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): తొలి తెలుగు సినీ గీత రచయిత చందాల కేశవదాసు 143వ జయంతిని ఎన్జీవోస్‌ కాలనీలోని గణేష్‌ ఆలయంలో శుక్రవారం రాత్రి  ఘనంగా నిర్వహించారు. ఆకృతి సంస్థ అధ్యక్షుడు సుధాకర్‌ నిర్వహించిన కార్యక్రమానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. చందాల కేశవదాసు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కేశవదాసు 30 యేళ్ల పాటు సినీ రంగానికి చేసిన సేవలు, ఆయన పాటల ప్రాచుర్యాన్ని వక్తలు స్మరించుకున్నారు. ‘భలే మంచి చౌకబేరము’ వంటి గీతాలను గుర్తు చేశారు. ప్రముఖ వాస్తు నిపుణుడు కృష్ణాది శేషు, డాక్టర్‌ వాసుదేవ్‌, కవి బాలకృష్ణ ప్రసాద్‌, పీవీకే సోమయాజులు, మంగపతిరావు, తదితరులు చందాల కేశవదాసు గొప్పతనాన్ని గుర్తు చేశారు.