తుమ్మలపల్లిలో బాలమురళీ 88వ జయంతి వేడుకలు

అన్నవరపు రామస్వామికి అవార్డు ప్రదానం

వేడుకల్లో సీఎం చంద్రబాబు

విజయవాడ కల్చరల్‌, జూలై 7: ‘‘సంగీత ప్రపంచంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక చరిత్ర సృష్టించారు. తెలుగుజాతి, సంగీతం ఉన్నంత వరకు ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 88వ జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ఆయన పేరిట ప్రకటించిన రూ.10లక్షల జాతీయ పురస్కారాన్ని అన్నవరపు రామస్వామికి అందజేశారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్నప్పుడు తనను బాలమురళీకృష్ణ బాగా అభిమానించారని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతికి, మన రాష్ట్రానికి గౌరవం తేవడంతో ఆయనతో తాను సన్నిహితంగా మెలిగానన్నారు. సంగీత స్రవంతికి ఆయన చేసిన కృషి శాశ్వతంగా గుర్తుండాలన్న ఉద్దేశ్యంతోనే ఈ అవార్డును ప్రకటించామన్నారు. సంగీతంలో రారాజు త్యాగరాజును చూడకపోయినా మంగళంపల్లిని చూసే భాగ్యం మనకు దక్కిందన్నారు.

20వేలకు పైగా కచేరీలు ఇచ్చిన ఘనుడనీ, అన్ని భాషల్లోనూ విశేష ప్రతిభను చూపారన్నారు. బాలమురళీకృష్ణ స్నేహితుడు అన్నవరపు రామస్వామికి ఈ అవార్డును ఇస్తున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. సంగీతం ప్రజల్లో చైతన్యాన్ని, మానసిక వికాసాన్ని తీసుకొస్తుందని చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో మంగళంపల్లి జయంతిని మరింత ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుడు డి.విజయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.