చిక్కడపల్లి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): తెలుగు సినిమా సంగీతం ఒకప్పుడు చాలా మాధుర్యంతో ఇంపైన సంగీతంతో, చక్కని అర్థవంతమైన సాహిత్యంతో అలరారుతుండేది. పాత తరంలోని సంగీత దర్శకులు, గాయకులు చాలా కష్టపడి స్వరకల్పన చేసి సాధన చేసి పాడేవారు. అందువల్ల అవి ఎక్కువ కాలం నిలవగలిగాయని, ఇంకా నిలుస్తాయని చాలా మంది అభిప్రాయం. ఈ రోజుల్లో సినిమాల్లోని సంగీతం గాని, పాటలు గాని మాధుర్యంతో ఉండడంలేదని, సంగీత ప్రియులు, విద్వాంసులు చాలా చోట్ల విమర్శలు చేయడం మనం చూస్తుంటాం. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందని దానిని ఎలా సరిదిద్దాలి అనే విషయంపై నగరంలోని ‘మధురస్వర తృష్ణ’ అనే సంగీత సాంస్కృతిక సంస్థ ఒక విశ్లేషణ, చర్చ ఆదివారం సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో నిర్వహించనుంది. ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్‌, ఓలేటి పార్వతీశం, రావి కొండలరావు వంటి ప్రముఖులతో ఇష్టాగోష్ఠి నిర్వహిస్తోంది.