చిక్కడపల్లి, జూలై10(ఆంధ్రజ్యోతి): సినారె- ఆళ్ళ స్వర్ణకంకణాన్ని ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి బహూకరించనున్నారు.  మొట్టమొదటిసారిగా డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి నెలకొల్పిన ఈ స్వర్ణకంకణ ప్రదానం ఈనెల 16న సాయంత్రం రవీంద్రభారతిలో జరుగుతుందని  వంశీ సంస్థల వ్యవస్థాపకుడు డా. వంశీ రామరాజు తెలిపారు. వంశీ ఇంటర్నేషనల్‌ - వేగేశ్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, టి సుబ్బిరామిరెడ్డి లలితకళా పరిషత్‌, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ అభినందనలతో డా. సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. గోవిందరాజు రామకృష్ణారావు రచించిన సర్వాంగీణ ప్రతిభామూర్తి గ్రంథం, డా. కంపెల్ల రవిచంద్రన్‌ రచించిన ‘నీ పేరు తలచినా చాలు’ గ్రంథాల ఆవిష్కరణ ఉంటుందన్నారు. ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ప్రభుత్వ సలహాదారు డా. కేవీ రమణాచారి, డా. టి సుబ్బిరామిరెడ్డి, సినీ నటి డా. జమున,  డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, బొల్లినేని కృష్ణయ్య, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ల, సుధీష్‌ రాంభొట్ల, బండారు సుబ్బారావు, సినారె మనవరాలు మనస్విని రెడ్డి  పాల్గొంటారన్నారు. అమెరికాకు చెందిన ఆకునూరి శారద బృందంచే ప్రణయ రాగవాహిని సినీ సంగీత విభావరి ఉంటుందన్నారు.