రవీంద్రభారతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలుగు జాతి గర్వించే సాహితీవేత్తలు దాశరథి, సినారెలని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. సోమవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో యువకళావాహిని ఆధ్వర్యంలో మహాకవులు దాశరథి, డా.సి.నారాయణరెడ్డిల జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి వడ్డేపల్లి కృష్ణకు దాశరథి పురస్కారం, సినీగేయకవి చైతన్యప్రసాద్‌కు సినారె పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్య పురస్కారగ్రహీతలను సత్కరించి అభినందించారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన కవులు దాశరథి, సినారెలని పేర్కొన్నారు. వారిరువురి పేరిట నెలకొల్పిన పురస్కారాలను వడ్డేపల్లి, చైతన్యప్రసాద్‌లకు అందజేయడం సముచితమన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాహితీశిఖరాలు దాశరథి, సినారెలన్నారు. వారు సాహితీరంగంలో  తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత్రి కె.వి.కృష్ణకుమారి, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, సుధామ, ఆనంద్‌ బేతపూడి, వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.