రచయిత్రి కామేశ్వరికి తురగా జానకీరాణి సాహిత్య పురస్కారం ప్రదానం

ఎంవీఆర్‌ శాస్త్రికి తురగా కృష్ణమోహన్‌రావు పాత్రికేయ పురస్కారం
 

ఖైరతాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): తురగా ఫౌండేషన్‌ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం సైఫాబాద్‌లోని విద్యారణ్య పాఠశాలలో సందడిగా సాగింది. తురగా జానకీరాణి సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి డి.కామేశ్వరికి, తురగ కృష్ణమోహన్‌రావు పాత్రికేయ పురస్కారాన్ని ప్రముఖ సంపాదకులు, సీనియర్‌ పాత్రికేయులు ఎంవీఆర్‌ శాస్త్రికి అందజేశారు. సీనియర్‌ పాత్రికేయులు వీరాజి, ప్రముఖ రచయిత్రి కేబీ లక్ష్మి అతిథులుగా హాజరై పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీరాజి మాట్లాడుతూ ప్రపంచాన్ని చుట్టివచ్చిన అనుభవంతో రాసిన రచనలు జానకీరాణి అందించారని అన్నారు. దినపత్రికల్లో పోటీలు పెట్టిన ఘనత ఎంవీఆర్‌ శాస్త్రికే దక్కుతుందన్నారు. అవార్డు పొందిన ఇద్దరు సృజనాత్మక రచనలను సమాజహితం కోరి చేశారన్నారు. ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ కేబీ లక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు జీవించి లేకున్నా ఇలాంటి పురస్కారాల రూపంలో వారిని అందరూ స్మరించుకునేలా చేస్తున్న వారి కుమార్తెలు ధన్యులన్నారు. ఈ సందర్భంగా జానకీదేవి, కామేశ్వరి రాసిన కథలపై ఆమె విశ్లేషించారు. పురస్కార గ్రహీత, ప్రముఖ పాత్రికేయులు ఎంవీఆర్‌ శాస్త్రి మాట్లాడుతూ  రాజకీయ, సామాజిక అంశాలను క్రోడీకరించి కృష్ణమోహన్‌ రచనలు చేశారన్నారు.  స్త్రీ విలువలకు కట్టుబడి తలెత్తుకొని నిలబడ్డ మహిళ జానకీరాణి అని కొనియాడారు. రచనాసక్తిలో వారి కుమార్తె ఉషారమణి ముందుకెళ్తున్నారన్నారు.  

ఇరు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్న సాహిత్య మూర్తులు ఉన్నా సాహిత్యం ప్రస్తుతం దీనావస్తకు చేరిందని, యువత సాహిత్య సమావేశాలకు, చర్చలకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మరో పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత్రి కామేశ్వరి మాట్లాడుతూ అన్యోన్య దంపతులుగా తురగా వారు పేరు ప్రఖ్యాతులు సాధించారన్నారు.  ప్రభుత్వాలు వారి రాజకీయ గొడవల్లోనే మునిగిపోతున్నారని, సాహిత్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సభకు  ప్రముఖ రచయిత సుధామ అధ్యక్షత వహించగా, తురగా దంపతుల కుమార్తెలు, ఫౌండేషన్‌ నిర్వాహకులు ఉషారమణి, వసంతశోభలు పాల్గొన్నారు.