నాట్య కళాకారిణికి ఎన్టీఆర్ బయోపిక్‌లో కీలక పాత్ర

‘ఎన్‌టీఆర్‌’ బయోపిక్‌లో ఓరుగల్లు అమ్మాయి
పురందేశ్వరి పాత్రలో నటించి మెప్పించిన  కాట్రగడ్డ హిమాన్సీ

వరంగల్‌ కల్చరల్‌: ఓరుగల్లు నగరానికి చెందిన యువ నాట్యకారిణి, వర్ధమాన నటి కాట్రగడ్డ హిమాన్సీ తన కళారంగ ప్రయాణంలో మరో మైలురాయిని దాటింది. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ రూపొందించిన ‘ఎన్‌టీఆర్‌-కథానాయకుడు’ సినిమాలో పురందేశ్వరి పాత్రను పోషించి మెప్పించింది. సినిమాలో అరగంట పాటు అగ్రనటుల సరసన కనిపించి ఔరా.. అనిపించింది. హన్మకొండలోని అడ్వకేట్స్‌ కాలనీకి చెందిన  హిమాన్సీ బాల్యం నుంచే శాస్త్రీయ నృత్యం, నటనా రంగాల్లో రాణిస్తోంది.
 
ఎన్టీఆర్‌ చిత్రంలో హీరోగా నందమూరి బాలకృష్ణను, ఇతర పాత్రలకు  రాణా, అక్కినేని సుమన్‌, విద్యాబాలన్‌,  కైకాల సత్యనారాయణ, ప్రకాష్ రాజ్‌, తదితర ముఖ్యమైన నటీనటులను దర్శకుడు క్రిష్‌ జాగర్లముడి ఎంపిక చేసుకున్నారు. ఇదే క్రమంలో పురందేశ్వరి పాత్రకు వరంగల్‌కు చెందిన హిమాన్సీని ఎంపిక చేశారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక జాతీయ స్థాయిలో ఇప్పటికే వందలాది నృత్య ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా  హిమాన్సీ మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో  దర్శకుడు క్రిష్‌ ఆమె బయోడేటాను తెప్పించుకొని, ఆమె నటనను పరిశీలించి పురందేశ్వరి పాత్రకు ఎంపిక చేసుకున్నారు.  
 
తెలుగులో ఇట్లు అంజలి, యూ - కథేహీరో, సూర్యాస్తమయం తదితర సినిమాల్లో హిమాన్సీ  కథానాయికగా నటించింది. ఆ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.  దీంతో పాటు  కన్నడంలో నవిల కిన్నెరి నృత్యప్రాధాన్యత గల సినిమాలో హీరోయిన్‌గా నటించింది.  తాజాగా ఎన్‌టీఆర్‌ బయోపిక్‌లో పురందేశ్వరి పాత్రలోనూ మెప్పించడంతో ఆమెకు తెలుగు సిని మా రంగంలో మరిన్ని అవకాశాలు వచ్చేందుకు మార్గం సుగమమైంది. హన్మకొండ అడ్వకేట్స్‌ కాలనీకి చెందిన హిమాన్సీ ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది.  నృత్యంలో తన గురువు బొంపెల్లి సుధీర్‌రావుతో పాటు తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి ప్రోత్సాహంతో తాను రాణిస్తున్నట్లు హిమాన్సీ తెలిపింది.