జూన్‌ నుంచి అక్టోబరుకు వాయిదా..

వాతావరణం దృష్ట్యా సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌ మే 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జూన్‌ 2నుంచి 8వ తేదీ వరకు జరగాల్సిన తెలుగు మహాసభలను అక్టోబరు 22నుంచి 28వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన జూన్‌ 2వ తేదీ అష్టమి కావడంతోపాటు, ఆ తరువాత రోజుల్లో వాతావరణం అనుకూలంగా ఉండదని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఇతర సాహితీ పెద్దలు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. బుధవారం ప్రగతిభవన్‌లో వారంతా సీఎంను కలిసి మహాసభల నిర్వహణపై చర్చించారు. దేశ, విదేశాల నుంచి తెలుగు సాహితీరంగ ప్రముఖులను ఆహ్వానించడంతోపాటు ఏర్పాట్లు కూడా ఘనంగా చేయాల్సి ఉన్నందున సమయం తీసుకోవాలని నిర్ణయించారు. విజయదశమి సందర్భంగా సెప్టెంబరు 30న మహాసభలకు అంకురార్పణ చేయాలని, అక్టోబరు 22 నుంచి 28 వరకు నిర్వహించే సభలకు ఏర్పాట్లు చేయాలని, ఎజెండా రూపొందించాలని సీఎం ఆదేశించారు.