కళ్లకు కట్టిన రచయిత్రి హీరానందిని

15-08-2018:హిందూ, ముస్లిం, సిక్కు అన్న భావన వారిలో లేదు.. మదినిండా స్వరాజ్య కాంక్షే.. రెండు దశాబ్దాల బానిస సంకెళ్లు వీడనాడ ఒక్కటై కదిలారు. 1947 రానే వచ్చింది. బ్రిటిషు బలగాలు దేశాన్ని వీడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అఖండ భారత్‌ ఆనందంలో మునిగిపోయింది. కానీ, కొందరి గుండెల్లో దడ దడ.. ప్రాణభయం.. కాలు బయట పెడితే రక్తం కళ్ల చూడాల్సిన పరిస్థితి ‘‘నీ మతానికి ఇక్కడ చోటు లేదుపో’ అంటూ ఒకడు మరొకరి తల నరికాడు. పారిపో.. లేదా చచ్చిపో అని ఇంకొకడు అరిచాడు. కత్తులు, గొడ్డళ్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చి రక్తపుటేర్లు పారించారు.’ ఇదీ! భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఆ నాడు జరిగిన హింసాకాండ. స్వాతంత్య్రం సిద్ధిస్తూనే భారత్‌, పాక్‌ రెండుగా విడిపోయాయి. ఆ సందర్భంలో ఎన్ని లక్షల మంది హతులయ్యారో ఎవ్వరికీ తెలీదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, భార్యాబిడ్డలతో, కట్టుబట్టలతో పారిపోయి వచ్చిన కుటుంబాలెన్నో. ఆనాటి పరిస్థితులను వివరిస్తూ హీరానందిని అనే రచయిత్రి ‘నైట్‌ డైరీస్‌’ పుస్తకాన్ని రచించారు.

ఈ పుస్తకంలో ప్రధాన పాత్రధారి ‘నిషా’ అనే 12 ఏళ్ల అమ్మాయి. ‘‘ఆమె.. 1947 ఆగస్టు 15న తన డైరీలో ‘నేనిప్పటి వరకు నిలబడిన నేల ఈరోజు భారతదేశం కాదు. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి.’ అని రాసుకుంటుంది. తల్లి ముస్లిం, తండ్రి హిందూ. వారికి పుట్టిన గడ్డను విడవడం ఇష్టం లేదు. కానీ, బతికి ఉండాలంటే పారిపోక తప్పదు. పాక్‌ నుంచి వారి కుటుంబం భారత్‌కు శరణార్థులుగా వచ్చేస్తుంది’’ అంటూ నాటి పరిస్థితులను రచయిత్రి కళ్లకు కట్టారు. కొన్ని కల్పితాలతో, కొన్ని నిజాలతో ఆమె ఈ పుస్తకాన్ని రాశారు.