నేటి పరిణామాలకు నాడే అక్షర రూపం

ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌

 ఆయన రచనలపై పరిశోధన జరగాలి
 ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్‌
 ధనికొండ శత జయంతి సందర్భంగా
బుక్‌ ఫెస్టివల్‌లో రచనల ఆవిష్కరణ

విజయవాడ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దూరదృష్టితో ఆలోచించి, వాటికి తన కాలంలోనే అక్షరరూపం ఇచ్చిన దార్శనిక రచయిత ధనికొండ హనుమంతరావు అని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. మానసిక తత్వాన్ని ఆయన రచనలు చక్కగా పట్టుకొన్నాయని కొనియాడారు. ప్రముఖ రచయిత ధనికొండ హనుమంతరావు శతజయంతి సందర్భంగా ఆయన కథలను పుస్తకరూపంలో తీసుకొచ్చారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యాపకులు మాడభూషి సంపత్‌ ఈ పుస్తకానికి సంపాదకునిగా వ్యవహరించారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో యద్దనపూడి సులోచనారాణి సాహితీ వేదికపై గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఈ కథా సంపుటిని బుద్ధ ప్రసాద్‌ ఆవిష్కరించి.. ప్రసంగించారు. ‘‘అభిసారిక పత్రిక పేరు వినగానే ధనికొండ గుర్తుకొస్తారు. లైంగిక విజ్ఞానంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఆయన అప్పట్లోనే ధైర్యంగా రచనలు చేశారు.
 
తెనాలిలో హేతువాద ఉద్యమం నడుస్తున్న సమయంలో ఆయన తన భావాలకు అక్షరరూపం ఇవ్వడం ప్రారంభించారు. అనేకమంది రచయితలకు ధనికొండ వెన్నెముకగా నిలిచారు. మా తండ్రితో కలిసి మద్రాసులో వివిధ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ధనికొండను చూశాను. ప్రముఖ రచయితల రచనలన్నీ ఆయన నెలకొల్పిన క్రాంతి ప్రెస్‌లోనే అచ్చయ్యాయి. ఆ ప్రెస్‌లో ముద్రించిన పుస్తకాలను చూడగానే, చదవాలన్న భావన పుస్తకప్రియుల్లో కలిగేది. ఎందరో ప్రసిద్ధ రచయితల రచనలను అందించిన ఆయన రచనలకు ఇప్పుడు కథాసంపుటి రూపం ఇవ్వడంతో మరుగునపడిన మాణిక్యాన్ని వెలికితీసినట్టయింది’’ అని బుద్ధప్రసాద్‌ అన్నారు. దీని వల్ల ఆయన రచనలపై జరిగే పరిశోధనలు మరింత సులభతరమవుతాయని ఆకాంక్షించారు. విశేష సంఖ్యలో రచనలు చేసి, పాఠకులను రంజింపచేసిన రచయిత ధనికొండ హనుమంతరావు అని గౌరవ అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కే శ్రీనివాస్‌ కొనియాడారు.
 
తెలుగు పాఠకుల సంఖ్య పెంచిన రచయిత కూడా ఆయనేనన్నారు. ‘‘ధనికొండ రచనా వ్యాసంగం ఆగిపోయి ఆయన నిష్క్రమించిన తర్వాత, తలుచుకోవడం తగ్గిపోయింది. తెలుగు సాహిత్యంలో స్వతంత్రంగా రచనలు చేసే ప్రతి రచయితదీ ఇదే సమస్య. స్వతంత్రంగా రచనా వ్యాసంగం చేసినవారిని తదనంతర రోజుల్లో గుర్తు చేయడానికి ప్రత్యేకంగా ఎవరూ ముందుకు రాకపోవడం తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్న ఒక లోపం. స్వతంత్ర భావాలతో రచనలు చేసిన రచయితలను గుర్తు చేసుకునే సత్సంప్రదాయం తెలుగు సాహిత్యంలో రావాలి’’ అని ఆకాంక్షించారు. ఈ క్రమంలో ధనికొండ రచనలను వెలుగులోకి తీసుకురావడం అనేది.. ఆధునిక తెలుగు సాహిత్య, కాల్పనిక, అనువాద ప్రక్రియలను, వాటికి సంబంధించిన చరిత్రను ఒక సవ్యమైన దిశలో ప్రతిష్ఠించడానికి చేస్తున్న ప్రయత్నంగా చూడాలన్నారు. ఆయన రచనలపై పరిశోధన జరగాలని ఆకాంక్షించారు. ‘‘ఆధునిక తెలుగు సాహిత్యం ఉత్తరాంధ్ర నుంచి ఒక వేగుచుక్కలా ప్రారంభమైంది.
 
ఆ తర్వాత గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా ఆధునిక తెలుగు సాహిత్య రచయిత ఆవిర్భవించాడు. గుడిపాటి వెంకటచలం నుంచి కొడవటిగంటి కుటుంబరావు వరకు 20 ఏళ్ల పాటు ఇది కొనసాగింది. ఆ తర్వాత ధనికొండ నుంచి రావూరి భరద్వాజ వరకు ఈ పరంపర కొనసాగింది’’ అని వివరించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జీవీ పూర్ణచంద్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ధనికొండ కుమారుడు శ్రీధరరావు, ఎమెస్కో పబ్లికేషన్స్‌ అధినేత విజయ్‌కుమార్‌, ప్రముఖ రచయిత విహారి పాల్గొన్నారు. అనంతరం కే శ్రీనివాస్‌ దంపతులను నిర్వాహకులు సత్కరించారు.