రవీంద్రభారతి, అక్టోబర్‌ 3 (ఆంధ్రజ్యోతి): సమాజాన్ని ప్రభావితం చేసే కవితలు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. డాక్టర్‌ కుమార్‌ డబ్బీకార్‌ రచించిన కవి తా సంపుటి ‘ఐనా ప్రయాణం’ ఆవిష్కరణ సభ తెలంగాణ భాషా సాంస్కృతిక సౌజన్యంతో తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతి కాన్ఫ్‌రెన్స్‌ హాల్‌లో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. డబ్బీకార్‌ రచనలు ఆసక్తికరంగా ఉంటాయన్నారు. సమాజాన్ని చైతన్యపరిచే కవితలు పొందుపరచడం అభినందనీయమని అన్నారు. ఈ సభకు నాళేశ్వరం శంకరం సభాధ్యక్షత వహించగా ఆత్మీయ అతిథులుగా సాహితీవేత్తలు అమ్మంగి వేణుగోపాల్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, కందుకూరి శ్రీరాములు తదితరులు పాల్గొని రూప్‌కుమార్‌ను అభినందించారు.