రవీంద్రభారతి, అక్టోబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): సామాజిక కోణంలో వచ్చిన కథలు సమాజంపై బలమైన ప్రభావాన్ని చూపుతాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో డా.శీలం రమాదేవి పరిశోధన గ్రంథం ‘‘డా.వాసిరెడ్డి సీతాదేవి, అబ్బూరి ఛాయాదేవి కథలు -విశ్లేషణ’’ ఆవిష్కరణ సభ మంగళవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందిని సిధారెడ్డి గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. వ్యాపార సాహిత్యం రాజ్యమేలుతున్న కాలంలో స్త్రీలు, అట్టడుగు ప్రజల సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని అద్భుత కథా సాహిత్యం అందించిన ఘనత స్త్రీవాద రచయితలై డా.వాసిరెడ్డి, అబ్బూరి ఛాయాదేవిలకు దక్కుతుందని అన్నారు. ఈ ఇరువురి కథలను విశ్లేషించి ప్రామాణికమైన పరిశోధన చేసిన రమాదేవికి అభినందనలు తెలిపారు. సాహితీవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సభలో మామిడి హరికృష్ణ, డా.ఏనుగు నర్సింహారెడ్డి, రచయిత్రి భేరి సునీతా రామ్మోహన్‌రెడ్డి, తేజ సంస్థ అధ్యక్షుడు డా.పోరెడ్డి రంగయ్య, కార్యదర్శి పోరెడ్డి రాజేశ్వరి, సి.వి.శ్రీనివాస్‌, రాంరెడ్డి, పెద్దూరి వెంకటదాసు పాల్గొని రచయిత్రి డా.రమాదేవి దంపతులను ఘనంగా సత్కరించారు.