సంజయ్‌కిషోర్‌కు  అక్కినేని ఫౌండేషన్‌ ప్రజ్ఞా పురస్కార ప్రదానం

బర్కత్‌పుర, మే 7 (ఆంధ్రజ్యోతి): అద్భుతమైన నటుడు డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు అని పలువురు వక్తలు కొనియాడారు. క్రమశిక్షణ, మర్యాదకు ప్రతీకగా నిలిచారని అన్నారు. మంగళవారం రాత్రి రవీంద్రభారతిలో అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండి యా ఆధ్వర్యంలో డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు 75వ సినీ జన్మదిన వేడుకల సందర్భంగా మన అక్కినేని పుస్తక రచయిత సంజయ్‌కిషోర్‌కు అక్కినేని ఫౌండేషన్‌ ప్రజ్ఞా పురస్కారం- 2019 ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ పార్లమెంట్‌ సభ్యురాలు, ప్రముఖ సినీనటి జమున, ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు, సినీ నటుడు గిరిబాబు, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రఖ్యాత నటుడు, రచయిత, దర్శకులు తనికెళ్ల భరణి, ఐఆర్‌టీఎస్‌ అధికారి రవిపాడి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికీ ఎప్పటికీ గుర్తు పెట్టుకోగల నటుడు డా.అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. సంజయ్‌కిషోర్‌ రచించిన ‘మన అక్కినేని’ పుస్తకం అద్భుతంగా ఉందని, ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు. కార్యక్రమంలో అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు చీదెళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశ్రీ, విజయలక్ష్మీల ఆధ్వర్యంలో అక్కినేని సినీ సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు.