ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం, నవంబరు 6 : అభ్యుదయ కవి, రచయిత, సామాజిక విశ్లేషకుడు జాతాశ్రీ మృతి సాహితీ లోకానికి, అభ్యుదయవాదులకు తీరనిలోటని, ఆయన సామాజిక చైతన్య కవులకు ఆదర్శనీయుడని పలువురు కొనియాడారు. మంగళవారం జాతశ్రీ భౌతికకాయానికి భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో అంత్యక్రియలు నిర్వహించారు. జాతశ్రీ ఆదివారం మృతి చెందగా, ఆయన కుమారులు అమెరికాలో ఉన్నందున సోమవారం రాత్రి వారు కొత్తగూడెం చేరుకున్నారు. మంగళవారం ముగ్గురు కుమారుల సమక్షంలో కొత్తగూడెంలోని సెయింట్‌ ఆం డ్రూస్‌ చర్చి శ్మశాన వాటికలో జాతశ్రీ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబీర్‌పాషా, సీపీఎం నాయకుడు కాసాని అయిలయ్య తదితరులు జాతాశ్రీ భౌతికకాయాన్ని సంద ర్శించి నివాళులర్పించారు.