హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి) : ‘‘అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు’’ అని చైతన్య పతాకై నినదించిన కవి. ‘‘ప్రతిహింసకు పూనుకున్న ప్రతి నరుడు నరసింహుడు’’ కావాలని పిలుపిచ్చిన ధీశాలి. అణిచివేత, వివక్షలపై ధిక్కార స్వరం. ‘‘అన్ని భేదాలను కలుపుకొని భాషను సుసంపన్నం చేసుకోవాలి. యాసలను ఈసడించుకోవద్దు. ఎవరి వాడుక భాషలో వారు రాయాలి’’ అని హితవు పలికిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. నేడు(09-09-2019) ఆయన 105వ జయంతి. తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మాతృభాషపై ప్రజాకవి కలం నుంచి జాలువారిన అరుదైన కవితలతో పాటూ, ఆయన స్ఫూర్తిని నిపుణుల అభిప్రాయాలలో.!

కాళోజీ కలలు నెరవేరాలంటే.. : నలిమెల భాస్కర్‌, ప్రముఖ భాషావేత్త.
కొంత మంది వ్యక్తుల చొరవతో తెలంగాణ పదకోశాలు వెలువడ్డాయి. అయితే ఇంత వరకు సర్వ సమగ్రమైన తెలంగాణ భాషానిఘంటువు రాలేదు. ప్రభుత్వం భాషా శాస్త్రవేత్తలు, పండితులతో చర్చించి... ప్రతి మండలానికి ఒక భాషావేత్తను నియమించి, తద్వారా 33 జిల్లాలలో క్షేత్రస్థాయిలో వాడుకలోని పదాలను సేకరించాలి. వాటితో సమగ్రమైన నిఘంటువు రూపొందించాలి. పాఠ్యపుస్తకాలలో కొంత మేర తెలంగాణ పదకోశం వాడుతున్నారు. కానీ అచ్చిండు బదులు వచ్చిండు వాడచ్చు. ప్రామాణిక తెలంగాణ భాషను ఒకటి నుంచి పదవ తరగతి పాఠ్యపుస్తకాలలో దశల వారీగా ప్రవేశపెట్టాలి. కథలు, నవలలు, కవితలు తెలంగాణ భాషలో వెలువడుతున్నాయి. ఈ మధ్యకాలంలో మల్లేశం వంటి సినిమాల్లోనూ తెలంగాణ భాష వెలుగుతోంది. అయితే పాలనాభాషగా ఎదగాలి. అప్పుడుగానీ కాళోజీ కలలు నెరవేరవు.!
 
 
తెలంగాణ ధిక్కార స్వరం కాళోజీ: అమ్మంగి వేణుగోపాల్‌, కాళోజీ పురస్కార గ్రహీత.
తెలంగాణ బహుభాషా సమాజం. హైదరాబాదుని ‘మినీ ఇండియా’ అని పిలవడానికి కార ణం భాష కూడా ఒకటి. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు సీమాంధ్రులు తెలంగాణ భాషను చిన్నచూపు చూస్తున్నారన్న వాదన కూడా పదునెక్కుతూ వచ్చింది. కాళోజీ నారాయణరావు 1942లోనే ‘ఆంధ్రుడా’ కవితతో మాతృభాషను ఖాతరు చేయని వాళ్లను తీవ్రంగా విమర్శించాడు. ఉద్యమ కాలం అనుభవంతో ‘నిధులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చుగానీ, భాషా సంస్కృతులను నష్టపోతే తిరిగి సంపాదించడం అసాధ్యమనే సత్యాన్ని కాళోజీ, జయశంకర్‌ వంటి వారు ప్రచారం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగారు. కళింగాంధ్ర, గోదావరి, కృష్ణా, రాయలసీమ-తెలంగాణ లలో ఉన్న మాండలికాలమీద, ఆయా మాండలికాలలో రచనలు చేసిన రచయితల మీద కాళోజీకి అపారమైన గౌరవం. అం దుకే కొంతకాలం కాళోజీ జన్మదినాన్ని మాండలిక దినోత్సవంగా జరుపుకున్నారు. ‘‘పిల్లలు చదువుకునే వాచకాల్లో బడి పలుకుల భాష ఉంది. మనకు కావలసింది పలుకుబడుల భాష’’ అని ప్రజాకవి నినదించాడు. అంతేకాదు.. ‘‘రెండున్నర జిల్లాలదే దండి బాస అయినప్పుడు  తక్కినోళ్ల నోళ్లయాస తొక్కినొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలుగోరడం తప్పదు’’ అని కాళో జీ ధిక్కారస్వరం వినిపించారు. అందుకే కాళోజీ జయంతిని రాష్ట్రప్రభుత్వం తెలంగాణ భాషాదినోత్సవం గా జరుపుకుంటున్నాం. దీంతో జాతి ఆత్మగౌరవం రెట్టింపు అయింది.
 
 
తెలంగాణ పదకోశాలు...
ఆచార్య రవ్వా శ్రీహరి ‘‘నల్గొండ జిల్లా పదకోశం’’
నలిమెల భాష్కర్‌ ‘‘తెలంగాణ పదకోశం’’
కపిలవాయి లింగమూర్తి 
కాలువ మలయ్య
ముదిగంటి సుజాతారెడ్డి
భూతం ముత్యాలు తదితరులు రూపొందించిన పదకోశ గ్రంథాలు.
ఆచార్య ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో దాదాపు 30వేల పదాలతో తెలంగాణ పదకోశం.
తెలంగాణలో ఇప్పటి వరకు వెలువడిన పదకోశ గ్రంథాలు ఇవి. అయితే, స్వరాష్ట్రం సిద్ధించి ఆరేళ్లు అయినా సమగ్ర తెలంగాణ భాషా నిఘంటువు అంటూ లేకపోవడం శోచనీయం అని కొందరు రచయితల అభిప్రాయం. 
 
గుగివా థియాంగో  స్ఫూర్తితో...
మాతృభాషను పరిరక్షించుకోవడంలో ప్రముఖ కెన్యా రచయిత గుగివా థియాంగో ఆదర్శనీయం. ఆయన ఆంగ్లంలో ప్రొఫెసర్‌. తొలినాళ్లలో ఇంగ్లీషులో పలు రచనలు చేశారు. కొంత కాలం తర్వాత తన మాతృభాష ‘‘కికుయు’’లో మాత్రమే రచనలు సాగించాలని గూగీ నిశ్చయించుకున్నారు. అందుకు కారణం వలస పాలన వల్ల కెన్యాలో 22శాతం మంది ప్రజలు మాట్లాడే కికుయు భాష ఆంగ్లభాషా ప్రభావంతో నిరాదరణకు లోనవ్వడం. మన రచయితలు, కవులు కూడా గుగీవా థియాంగోను స్ఫూర్తిగా తీసుకొని, తమ మాండలికాలలో రచనలు సాగించడం ద్వారా ఆయా మాండలికాలకు మనుగడ లభిస్తుంది. తద్వారా వాటి ఆస్తిత్వానికి భగంవాటిల్లదని కొందరు భాషావేత్తలు సూచిస్తున్నారు. 

ఆంధ్రుడా..!
- 1942లో నిజాం రాజ్యంలో తెలుగు నిరాదరణపై కాళోజీ స్పందన.
ఏ భాషరా నీది యేమి వేషమురా ?
ఈ భాష ఈ వేష మెవరి కోసమురా ?
ఆంగ్లమందున మాటలాడ గలుగగనే
ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా ?
సూటుబూటు హ్యాటు షోకుగా దొడుగ
ఘనతేమి వచ్చెరా గర్వమేటికిరా ?
ఉర్దూ మాటలాడి యుబ్బిబ్బిపడుటకు
కారణంబేమిటో కారణం చెప్పుమురా ?
లాగుషేర్వాణీలు బాగుండుననుచు
మురిసిపోయెదవంత మురిపమేమిటిరా?
నీ వేషభాషలిల నిగ్గుదేలినవన్న
విషయంబు నీవేల విశ్వసింపవురా?
నీ భాష దీనతకు నీ వేష దుస్థితికి
కారకుడవీవయని కాంచవెందుకురా?
నీ వేషభాషలను నిర్లక్ష్యముగ జూచు
భావదాస్యంబెపుడు బాసిపోవునురా?
నీ భాషయందును నీ వేషమందును
స్వాభిమానముడిగిన చవటవీవేరా?
తెలుగు బిడ్డడవయ్యు తెల్గు రాదంచును
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా?
దేశ భాషలందు తెలుగులెస్సయటంచు
తెలుగుబిడ్డా! యెప్పుడు తెలుసుకొందువురా?
తెలుగుబిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు
 సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా?

కాళోజీ రాసిన కవితలు..
 లాగూ షేర్వానీలు మాని తెలంగాణ వారు
 తీరపోని దారి బట్టి వేషాలు వేస్తున్నరు
 అందరికీ ‘ఆంధ్వత్వం’ సోకి ఆడిస్తున్నది
 తెలుగువారి రాజ్యం ఇది ప్రాంతం మాటెత్తొద్దు
 పెత్తనము రెండున్నర జిల్లాలది మరవొద్దు
 భాషా సంస్కృతి యాస రెండున్నర జిల్లాలది
 విద్యావిజ్ఞానమంత రెండున్నర జిల్లాలది
 కథలు కైతలు అన్ని రెండున్నర జిల్లాలవికిర్లై
 బాలానందం సాంతము రెండున్నర జిల్లాలది
 రేడియోలు సినిమాలు రెండున్నర జిల్లాలవి
 నైపుణ్యం చాతుర్యం రెండున్నర జిల్లాలది
 ప్రతి విషయం తుదిమాట రెండున్నర జిల్లాలది
 ఆంధ్రుల సభ్యత సంస్కృతి రెండున్నర జిల్లాలది
 ఆటలు పాటలు రెండున్నర జిల్లాలవి
 తక్కినోళ్లు తెలుగుతనం కోల్పోయిన దౌర్భాగ్యులు
 ఆంధ్రత్వము వద్దంటు నాన్‌ తెల్గూస్‌ అయినట్లు
 తెలంగాణపోళ్ళు మరీ పోకిర్లై పోతున్నరు
 ఆంధ్రులు అలజడి జేస్తే ప్రజావెల్లువనిపించును.