సముద్ర కెరటం కొత్త ఎత్తులు చూడాలని ఆశపడుతుంది. అంతెత్తున ఎగిసిపడుతుంది. ఆకాశాన్ని అందుకుంటుంది. తీరం మీద విరుచుకుపడుతుంది. హెలెన్‌ హోంగ్‌ రచనలు కూడా సముద్ర కెరటాల్లాంటివే. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఆమె మొదటి నవల ‘ద కిస్‌ కోషియంట్‌’ నవతరాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఎంతగా అంటే... ఒకే నెలలో నాలుగు ఎడిషన్లు ముద్రించాల్సి వచ్చింది.

నవలల్లో కొత్తదనం కోసం మొహం మొత్తి ఉన్న నవతరం పాఠకులు రచనల్లో మరింత వైవిధ్యాన్ని కోరుకుంటున్నారు. అయితే పాపులర్‌ అనిపించుకుంటున్న పుస్తకాల్లోనూ కొత్తదనం కొరవడింది. ఇటీవల హెలెన్‌ హోంగ్‌ నవల ‘ద కిస్‌ కోషియంట్‌’ ఆ లోటును తీర్చింది. ఆకలితో నకనకలాడే నవలాప్రియులు రుచికరమైన భోజనం దొరికినంత సంబరంగా నవలను నంజుకు తినేశారు. అందుకే మొన్న జూన్‌లో విడుదలయిన ఆ పుస్తకం కేవలం నెల రోజుల్లోనే నాలుగుసార్లు పునర్ముద్రణ పొంది సంచలనం సృష్టించింది.
 
ఆ నవలలో ఏముంది!?
స్టెల్లా లేన్‌... ఈ నవ లా క థానాయకి. ఆటిజంతో బాధపడుతుంది. తనొక బ్రిలియంట్‌. ఎలాంటి లెక్కలనైనా అవలీలగా సాల్వ్‌ చేస్తుంది. ప్రేమను కూడా ఒక అల్గారిథమ్‌ స్థాయికి కుదించి, పరిష్కారం కనుగొనాలని భావించి విఫలమవుతుంది.
అలాంటి అమ్మాయికి ఉత్తరధ్రువం లాంటి మైకేల్‌పాన్‌ తారసపడతాడు. ఆమె ప్రతి విషయాన్నీ ఫార్ములాతో పరిష్కారించాలనుకుంటే, అతగాడేమో హృదయం మాట వినమంటాడు. లవ్‌ మీద వాళ్ల పాయింట్‌ ఆఫ్‌ వ్యూ ఏమిటి? రెండు భిన్నధృవాల్లాంటి వీరు ప్రేమ పజిల్‌ను పరిష్కరించారా? ఎలా? అనేదే నవల ముగింపు. ‘ద కిస్‌ కోషియంట్‌’ నవల ఇప్పుడు అమెరికాలో హాట్‌కేక్‌!
 
జీవితం ఇచ్చిన ప్రేరణ
హెలెన్‌ హోంగ్‌ గురించి చాలా చెప్పుకోవచ్చు. అందులో మొదట చెప్పుకోవాల్సింది తనొక సిగ్గరి. ఎంతగా అంటే ఎవ్వరితోనూ మాట్లాడకుండా పుస్తకాలకే అంకితమయ్యేంతగా! ఆమె 8వ తరగతిలో ఉండగా మొదటి రొమాన్స్‌ నవలను చదివింది. అప్పట్నుంచి ఫ్యాంటసీ, హిస్టారికల్‌ నవలలు చాలా చదివేసింది. ‘‘వాటిల్లోని పాత్రలకు ప్రేమతో పాటు యుద్ధం, మానవజాతి రక్షణ లాంటి చాలా పెద్ద పెద్ద సమస్యలుంటాయి. వాస్తవికతకు చాలా దూరంగా ఉంటాయి. నా జీవితంలో అలాంటి సమస్యలు ఎప్పుడూ తారసపడలేదు. నేను ఎదుర్కొన్న సమస్యలు మచ్చుకైనా అందులో కానరావు.
 
‘ద కిస్‌ కోషియంట్‌’ నా జీవిత జ్ఞాపకాల సారం. నాలోని అభద్రతా భావాలను దాచుకోకుండా వాటికి పరిష్కారాల కోసం ఆ పుస్తకంలో అన్వేషించాను. పర్సనల్‌ స్టోరీస్‌ను రాస్తేనే నవలలు బెటర్‌గా ఉంటాయని నేను ఈ పుస్తకం రాసే క్రమంలో తెలుసుకున్నాను’’ అంటారామె. మూడు పదుల వయసులోనే జీవితం ఇచ్చిన ప్రేరణతో ఆమె ఈ నవలను రచించారు. హెలెన్‌కు ఆటిజం ఉండటం, అది నవలలో ప్రతిబింబించి కథలో వైవిధ్యం తెచ్చింది. మొదటి నవలే అయినా లవ్‌స్టోరీకి కావాల్సిన పర్‌ఫెక్ట్‌ ఫార్ములాను పట్టుకుంది.
 
పుస్తకం విడుదలయ్యాక చాలామంది చాలారకాలుగా పొగిడారు. వాటన్నింటిలోకి ‘‘కచ్చితంగా నేను చ దవాలనుకున్న పుస్తకం ఇదే’’అని ‘న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లింగ్‌ రచయిత్రి క్రిస్టినా లారెన్‌ చెప్పిన ఒక్కమాట పుస్తకం గొప్పతనాన్ని చెపుతుంది. ‘గుడ్‌రీడ్స్‌’ వెబ్‌సైట్‌లో ఈ పుస్తకానికి 7 వేల పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. హెలెన్‌ తన భర్త ఇద్దరు పిల్లలతో కలసి కాలిఫోర్నియాలోని శాండియాగోలో నివసిస్తున్నారు.