కడప (వైవీయూ), మార్చి 8: కడప యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రముఖ కవి, సంపాదకుడు గజ్జెల మల్లారెడ్డి స్మారకార్థం ఇచ్చే సాహితీ పురస్కారం ఇక నుంచి జాతీయ స్థాయిలో ప్రదానం చేస్తున్నట్టు వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ అత్తిపల్లి రామచంద్రారెడ్డి గురువారం తెలిపారు. పత్రిక, సాహితీ, సామాజిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి మల్లారెడ్డి స్మారకనిధి సహాయంతో ఏటా ఈ పురస్కారం ప్రదానం చేయనున్నామన్నారు. అనివార్య కారణాల వల్ల 2015-16, 2016-17 సంవత్సరాల్లో పురస్కారాలు ఇవ్వలేదని, వాటితోపాటు 2017-18 సంవత్సరానికి కలిపి ఒకేసారి ప్రదానం చేయనున్నట్టు వీసీ వివరించారు.

2015-16 సంవత్సరానికి గాను రచయిత, పాత్రికేయుడు తులనేకృష్ణ, 2016-17 సంవత్సరానికి ఇండియాటుడే అసోసియేట్‌ ఎడిటర్‌ రాజేంద్రలను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. 2017-18 సంవత్సరానికి గాను రచయిత, పాత్రికేయుడు పాలగిరి విశ్వప్రసాద్‌కు పురస్కారం అందజేస్తామన్నారు. ఈనెలలోనే కడపలోని సీపీ బ్రౌన్‌ గ్రంథాలయంలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నామన్నారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ చంద్రయ్య మాట్లాడుతూ వైవీ యూనివర్శిటీలో తెలుగు, లలిత కళలు, జర్నలిజం కోర్సుల్లో ప్రతిభ కనపరిచిన ఒక్కో విద్యార్థికి మూడు వేల రూపాయల పుస్తకాలను గజ్జెల మల్లారెడ్డి స్మారక నిధి తరఫున ప్రదానం చేయనున్నామన్నారు.