చిక్కడపల్లి, ఏప్రిల్‌12(ఆంధ్రజ్యోతి): ఘంటసాల గుడి వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.  ఘంటసాల ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌(గిఫ్ట్‌) వారు కుంట్లూర్‌లోని వంశీ- వేగేశ్న ఆశ్రమంలో నిర్మించిన ఈ వార్షికోత్సవం సందర్భంగా గాయకుడు శరత్‌చంద్రను ఘంటసాల సేవా పురస్కారంతో సత్కరించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌, హాస్యబ్రహ్మ శంకరనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఘంటసాల గుడి ధర్మకర్త డా. వంశీ రామరాజు మాట్లాడుతూ వంశీ- వేగేశ్న చేస్తున్న సేవకు ఘంటసాల పాట పునాదిగా నిలిచిందన్నారు. ఘంటసాల పాటలను గ్రామీణ ప్రాంతాలలోని గాయకులకు నేర్పాలనే ఉద్దేశంతో గిఫ్ట్‌ను స్థాపించినట్లు తెలిపారు.  దైవజ్ఞశర్మ, గాయకులు బాలకామేశ్వరరావు, శైలజ సుంకరపల్లి తదితరులు పాల్గొన్నారు.