అనారోగ్యంతో తుది శ్వాస
చివరికోరిక మేరకు బెంగళూరులో అంత్యక్రియలు
సాహిత్య, నాటక, సినీ రంగాలపై ఐదు దశాబ్దాలపాటు చెరగని ముద్ర
సామాజిక రుగ్మతలపై పోరాటం
రాష్ట్రపతి, ప్రధాని, సీఎం సంతాపం
అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబసభ్యులు

బెంగళూరు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత నాటక రంగ కళాకారుడు, నటుడు, అభ్యుదయవాది, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత.. గిరీశ్‌ కర్నాడ్‌ (81) ఇక లేరు. సాహిత్యం, నాటకం, సినీ రంగాలపై దాదాపు ఐదు దశాబ్దాలపాటు తనదైన ముద్ర వేసిన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి మరలిరాని లోకాలకు తరలిపోయారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. గిరీశ్‌కర్నాడ్‌కు భార్య సరస్వతి, కుమారుడు రఘు, కుమార్తె రాధ ఉన్నారు. కుమారుడు రఘు రచయిత, పాతిక్రేయుడు. తన తండ్రి కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని.. నిద్రలోనే కన్నుమూశారని, ఆ విషయాన్ని సోమవారం ఉదయం 8.30 గంటలకు గుర్తించామని రఘు వివరించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం బెంగళూరులో జరిగాయి. ఆయన మృతికి నివాళిగా సోమవారాన్ని సెలవుదినంగా, మూడు రోజులపాటు సంతాపదినాలుగా కర్ణాటక సీఎంవో తొలుత ప్రకటించింది.

రాష్ట్రానికి చెందిన ఇతర జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీతలు మరణించినప్పుడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపినట్లుగానే గిరీశ్‌ కర్నాడ్‌కు కూడా నిర్వహిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు వచ్చిన మంత్రులు డీకే శివకుమార్‌, ఆర్వీ దేశ్‌పాండే ఈ విషయాన్ని కర్నాడ్‌ భార్యకు తెలుపగా.. ఆమె అంగీకరించలేదు. తనకు ఎలాంటి అధికారిక అంత్యక్రియలూ వద్దని బతికున్నప్పుడే ఆయన చెప్పారని.. అది ఆయన చివరి కోరిక అని చెప్పారు. అంబులెన్స్‌లోనే ఆయన పార్థివదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి ఎలాంటి మతాచారాలూ పాటించకుండా, అధికారిక లాంఛనాలు లేకుండా విద్యుత్‌ దహనవాటికలో దహనం చేశారు.

మహారాష్ట్రలో జన్మించి..

గిరీశ్‌ కర్నాడ్‌ తల్లిదండ్రులు కృష్ణాబాయి, రఘునాథ్‌ కర్నాడ్‌. వారిది ఆదర్శవివాహం. కృష్ణాబాయి బాల్యవితంతువు. రఘునాథ్‌ కర్నాడ్‌తో వివాహమయ్యేటప్పటికే ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. రఘునాథ్‌ కర్నాడ్‌ డాక్టర్‌ కాగా.. ఆమె నర్సుగా పనిచేసేవారు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. వారిలో మూడోవాడు గిరీశ్‌కర్నాడ్‌. మహారాష్ట్రలోని మాథేరానాలో 1938 మే 19న ఆయన జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య మరాఠీలోనే సాగింది. తర్వాతి కాలంలో ఆయన విద్యాభ్యాసం కర్ణాటకలోని సిర్సిలో జరిగింది. గిరీశ్‌కర్నాడ్‌కు నాటకాలతో అక్కడే పరిచయమైంది. చిన్నప్పటి నుంచీ ఆయనకు యక్షగానం అంటే ఇష్టం. సాహిత్యంపైనా మక్కువ.
 
తన అభిరుచులను కొనసాగిస్తూనే 1958లో మాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ పాఠ్యాంశాలుగా డిగ్రీ పూర్తిచేశారు. పైచదువులకు ఇంగ్లండ్‌ వెళ్లారు. అక్కడ రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, ఫిలాసఫీలో పీజీ పూర్తిచేశారు. 1962-63లో ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. 1963-70 మధ్యకాలంలో చెన్నైలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌లో పనిచేశారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో నాటకరచనపై దృష్టిసారించారు. 1974-75 లో పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌గా వ్యవహరించారు. 1987-88లో యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 1988-93 నడుమ సంగీత్‌ నాటక్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. 2000-03లో లండన్‌లోని ఇండియన్‌ హైకమిషన్‌లో మినిస్టర్‌ ఆఫ్‌ కల్చర్‌గా, నెహ్రూ సెంటర్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
 
రచయితగా..
తన మాతృభాష అయిన కన్నడలో రచనలు చేసిన గిరీశ్‌ ఎన్నో నాటకాలు, సినిమాలకు కథలు రాసి, వాటికి దర్శకత్వం వహించి, నటించారు. విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఆయన రచనల్లో కల్పన, చరిత్ర ఉంటాయి. 1961లో ఆయన తన తొలి నాటకం.. ‘యయాతి’ రాశారు. ఆయన రచించిన ‘తుగ్లక్‌’ నాటకం.. నియంతృత్వం వల్ల కలిగే ప్రమాదాలను అద్భుతంగా చిత్రీకరించింది. ఇంకా.. ‘హయవదన’, ‘అంగుమల్లిగె’, ‘హిట్టిన హుంజ’, ‘నాగమండల’, ‘తేల్‌దండా’, ‘అగ్ని మట్టు మేల్‌’, ‘ద డ్రీమ్స్‌ ఆఫ్‌ టిప్పు సుల్తాన్‌’ వంటివి ఆయన రచనల్లో పేరెన్నికగన్నవి. 2011లో ‘హాడాడతా ఆయుష్య’ పేరిట ఆయన తన ఆత్మకథను రచించారు.
 
నటుడిగా..
గిరీశ్‌కర్నాడ్‌ నటించిన తొలిసినిమా.. ‘సంస్కార’. 1970లో విడుదలైన ఆ సినిమా రాష్ట్రపతి స్వర్ణకమలం అందుకుంది. ఆ తర్వాత నిశాంత్‌, మంథన్‌, స్వామి సినిమాల్లో నటించారు. దర్శకుడుగా వంశవృక్ష, గోధూళి, ఉత్సవ్‌ వంటి చిత్రాలు తీశారు. ‘టైగర్‌ జిందాహై’, ‘శివాయ్‌’ వంటి కమర్షియల్‌ చిత్రాల్లోనూ నటించారు. ‘ఆనందభైరవి’, ‘ధర్మచక్రం’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ వంటి తెలుగు సినిమాల్లోనూ నటించిన గిరీశ్‌ కర్నాడ్‌కు తెలుగులో ఆఖరి చిత్రం ‘కొమరం పులి’.
 
ఎన్నో అవార్డులు
నటుడుగా, రచయితగా.. గిరీశ్‌ కర్నాడ్‌ కీర్తికిరీటంలో ఎన్నో కలికితురాయిలున్నాయి. కర్ణాటకలో జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని పొందిన ఏడో వ్యక్తి ఆయన. భారత ప్రభుత్వం ఆయన్ను 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. 10 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, సంగీత్‌ నాటక్‌ అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు.. ఇలా ఎన్నో పురస్కారాలు పొందారాయన.
 
మోదీకి వ్యతిరేకంగా..
కన్నడనాట గిరీశ్‌కర్నాడ్‌ అభ్యుదయవాదిగా ఖ్యాతి గడించారు. మతోన్మాదంపై ఆయన అనేక పోరాటాలు చేశారు. అదే సమయంలో పలు వివాదాలను కూడా చవిచూశారు. 2014 ఎన్నికల సమయంలో.. మోదీని తీవ్రంగా వ్యతిరేకించిన 600 మంది రచయితల్లో గిరీశ్‌కర్నాడ్‌ ఒకరు. మోదీ అధికారంలోకి వస్తే ‘భారత్‌’ అనే భావనకు, రాజ్యాంగానికి ముప్పువాటిల్లుతుందంటూ ప్రజలకు రచయితలు రాసిన లేఖపై ఆయన సంతకం చేశారు. ఆరెస్సెస్‌, బీజేపీ వంటి హిందూ సంస్థలపై పలు సందర్భాల్లో వ్యతిరేకత వ్యక్తం చేశారు. గౌరీలంకేశ్‌ హత్యకు నిరసనగా ముందుండి ప్రదర్శనలు నిర్వహించారు. నోబెల్‌ గ్రహీత వీఎస్‌ నయిపాల్‌ను విమర్శించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సెకండ్‌ గ్రేడ్‌ రచయిత అంటూ వ్యాఖ్యలు చేశారు. టిప్పుసుల్తాన్‌ గనక హిందువై ఉంటే ఆయన్ను కూడా ఛత్రపతి శివాజీలాగా కొలిచేవారని మరో సందర్భంలో వ్యాఖ్యానించారు.