సికిందాబ్రాద్‌ రైల్వే స్టేషన్‌లో చిన్నారుల సందడి

ఫొటోలకు ప్రాధాన్యమిచ్చిన యూత్‌

ఈనెల 13 వరకు ప్రదర్శన

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : మహాత్మాగాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన ఛాయా చిత్ర ప్రదర్శనకు ఆదివారం విశేష స్పందన లభించింది. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ పాల్గొన్న అలనాటి అపూరపమైన చిత్రాలు, ఘట్టాలను ఈ ప్రదర్శన కళ్లకు కడుతోంది. ఆ రోజుల్లో ఏం జరిగింది.. ఎవరిని ఎవరు కలిశారు.. బిహార్‌, లండన్‌, సౌతాఫ్రికాలో ఏం జరిగింది.. అనే అంశాలను వివరించే స్పష్టమైన ఛాయా చిత్రాలను సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం-1పై ప్రదర్శనకు ఉంచారు.

ఆకట్టుకుంటున్న ఛాయా చిత్రాలు...

స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పడ్డ కష్టాలు, దేశవిదేశాల్లో పర్యటించిన సందర్భాలు, ఆయన చదువుకున్న కాలేజీల చిత్రాలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. శనివారం మొదటి రోజు 45 వేల మంది ప్రయాణికులు ఈ ప్రదర్శనను వీక్షించారు. రెండో రోజు ఆదివారం ఉదయం 11 గంటల వరకు 20 వేల మంది రైలు ప్రయాణికులు స్టాల్‌ను సందర్శించి చిత్రాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం కానీ.. ఇలాంటి అరుదైన ఫొటోలు ఎప్పుడూ చూడలేదని చిన్నారులు సంబరపడ్డారు. ఈ స్టాల్‌కు వచ్చే చాలా మంది సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. గాంధీజీ జీవిత చరిత్రకు సంబంధించిన స్టాల్‌ను హైదరాబాద్‌లో శాశ్వతంగా ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుందని పలువురు సందర్శుకులు అంటున్నారు.