‘తెలుగు చలనచిత్ర గీతాకోశం’ పై సమాలోచన సదస్సు

11-02-2018: రవీంద్రభారతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మంచి పాటలు సజీవంగా ఉంటాయని వక్తలు అభిర్ణించారు. శనివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో డాక్టర్‌ డి.ఎస్‌.ఉటుకూరి(ఆస్ట్రేలియా) రచించిన ‘తెలుగు చలన చిత్ర గీతాకోశం’ పుస్తక సమాలోచన సదస్సు జరిగింది. 1932 నుంచి 2000సంవత్సరం మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమా పాటలతో కూడిన తొలి పుస్తకాన్ని ప్రముఖ సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడు సంజయ్‌ కిషోర్‌ అందుకున్నారు. సాహితీవేత్తలు మృణాళిని, నటుడు రావి కొండలరావు, సీనియర్‌ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి తదితరులు హాజరై సమాలోచన సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా మృణాళిని మాట్లాడుతూ తెలుగు సినీ పాటల చరిత్ర గొప్పదని, సినిమాల్లో పాటల ప్రాధాన్యం ఎప్పటికీ తరగదన్నారు. రావికొండలరావు మాట్లాడుతూ పాటలు ఎంతో మందిని ప్రభావితం చేస్తాయన్నారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన డి.ఎస్‌. ఉటుకూరి తెలుగు సినీ పాటలపై పరిశోధన చేసి పుస్తకాలను రూపొందించడం ఆనందంగా ఉందన్నారు. గుడిపూడి శ్రీహరి మాట్లాడుతూ తాను చాలా సినిమాలకు రివ్యూలు రాశానని ,అందులో పాటలపై ప్రత్యేక దృష్టి సారించేవాడినన్నారు. ఈ కార్యక్రమంలో మాధవపెద్ది సురేష్‌, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.