చిక్కడపల్లి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): వికలాంగుల సేవలో విశేషంగా కృషి చేస్తున్న పి.పద్మావతికి జీవీఆర్‌ ప్రతిష్ఠాత్మక పురస్కార ప్రదానం ఘనంగా జరిగింది. జీవీఆర్‌-ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి త్యాగరాయ గానసభలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ తాను వికలాంగురాలినయినా తన తల్లి అన్నీ అయి సేవలు చేసి తనను పెంచిందన్నారు. ఏడు సంవత్సరాలు ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా పనిచేశానన్నారు. ఈ సందర్భంగా కుమ్మమూరి సుబ్బాయమ్మ రచించిన ‘యాత్రాకదంబం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2018 జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో దూరదర్శన్‌ పూర్వ సంచాలకుడు డాక్టర్‌ పాలకుర్తి మధుసూదనరావు, సీనియర్‌ పాత్రికేయుడు బైస దేవదాసు, కళా జనార్దనమూర్తి, అలపర్తి రామకృష్ణ, వెంకటదాసు, లక్ష్మీసామ్రాజ్యం, గుదిబండి వెంకటరెడ్డి పాల్గొన్నారు.