విజయవాడ:సుమధుర కళానికేతన్‌ హాస్యనాటిక పోటీల విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ, తెలుగునాట హాస్యానికి చిరునామా సుమధుర కళానికేతన్‌ అన్నారు. జంధ్యాల సరైన హాస్యానికి నిర్వచనం ఇచ్చారన్నారు. నటుడు జయప్రకాష్‌ సినిమా రంగంలో ఉచ్చస్ధితిలో ఉన్నప్పటికీ నాటకరంగం పట్ల మక్కువ వదలని ఏకైక నటుడు జయప్రకాష్‌ అన్నారు. నటుడు జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ నందులకన్నా జంధ్యాల పురస్కారం నాకు మిన్న అన్నారు.. మద్రాసు లాంటి నగరంలో 100 నిమిషాలు 100 నవ్వులు అని బోర్డు రాసి పెడతారన్నారు. 

మనలోను అంతకుమించి రచయితలున్నారని, రచనపై దృష్టి సారించాలన్నారు. నాటకాన్ని టికెట్‌ కొని చూడాలన్నారు. ఉచితంగా చూడొద్దని, కనీసం 25 రూపాయలైనా కళాకారునికి ప్రతిప్రేక్షకుడు ఇవ్వాలని ఆయన చేతులెత్తి అర్ధించారు. ఏపి సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ డి.విజయభాస్కర్‌ మాట్లాడుతూ రాబోయే రోజులు కళారంగానికి మంచి రోజులేనన్నారు. అనంతరం మూడు రోజుల పాటు నిర్వహించిన నాటిక పోటీల్లోని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఉత్తమ నాటిక, ఉత్తమ నటుడు, నటి, రచయిత, దర్శకుడు, వంటి మరో 20 మందికి బహుమతులను మండలి బుద్దప్రసాద్‌ అందజేశారు.