చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌ అంబికా కృష్ణ

వేడుకగా నంది నాటక అవార్డుల ప్రదానోత్సవం

ఏలూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నాటక రంగ కళాకారులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనని చలనచిత్ర అభివృ ద్ధి సంస్థ చైర్మన్‌ అంబికాకృష్ణ అన్నారు. ఆదివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన 21వ నంది నాటక బహుమతుల ప్రదానోత్సవం -2017లో ఆయన పాల్గొన్నారు. సీమాంధ్ర కళాకారులకు హైదరాబాద్‌లో స్థానం దక్కని నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో జీవో.116 తీసుకువచ్చారని చెప్పారు. దీని ప్రకారం రూ.4కోట్లలోపు బడ్జెట్‌తో సినిమా తీస్తే పూర్తిస్థాయిలో పన్ను రాయితీ కల్పిస్తారని, తెలుగుదనం ఉట్టిపడే తీస్తే రూ.10లక్షలు ప్రోత్సాహ బహుమతిగా ఇస్తారని వివరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ స్మారక పురస్కారాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన పాటిబండ్ల ఆనందరావుకు అందజేశారు.

రాష్ట్రస్థాయి కందుకూరి ప్రతిష్ఠాత్మక రంగస్థల, విశిష్ఠ పురస్కారాలను గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కోటేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అల్లం చంద్రరావు, వెంకటలక్ష్మికి ప్రకటించారు. ఇక పద్య నాటక రంగంలో హేలాపురి(ఏలూరు) కల్చరల్‌ అసోసియేషన్‌కు ప్రథమ బహుమతి, సాంఘిక నాటక విభాగంలో అభినయ ఆర్ట్స్‌ గుంటూరు, సాంఘిక నాటిక విభాగంలో జనశ్రేణి విజయవాడ, బాలల నాటికలో గుడివాడ ఆంధ్ర నలంద మునిసిపల్‌ హైస్కూలు, వర్సిటీల నాటికల విభాగంలో విజయవాడకు చెందిన యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌కి బంగారు నందులు వచ్చాయి. వ్యక్తిగత విభాగంలో నంది అవార్డులతో కలిపి మొత్తం 70నంది అవార్డులు ప్రదానం చేశారు.