రవీంద్రభారతి, హైదరాబాద్, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): కళాకారుల ఇళ్ల నిర్మాణంలో కోసం సిద్ధిపేటలో స్థలం కేటాయిస్తానని ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి హామీ ఇచ్చారు. ఆనంద సాయి ట్రస్ట్‌ తరుపున భూకేటాయింపుతో పాటు బ్యాంకుల ద్వారా ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. గురువారం రవీంద్రభారతి ఆరుబయట తెలంగాణ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రమణాచారి జన్మదిన వేడుకలు నిర్వహించారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రెండు వేల మంది జానపద కళాకారులు విచ్చేసి రమణాచారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ కేక్‌ కట్‌ చేసిన రమణాచారి కళాకారులనుద్దేశించి మాట్లాడారు. కళాకారులంటే తనకు మక్కువ ఎక్కువన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, జానపదకళాకారుల సంఘం అధ్యక్షుడు వంగ శ్రీనివాస్‌గౌడ్‌, కార్యదర్శి చెంచు లింగయ్య, కోశాధికారి మేకల నారాయణ, సభ్యులు కవిత, విద్యానందచారిలతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొని రమణాచారి దంపతులను భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు.రమణాచారి కళాకారుల కోసమే పుట్టారు: స్వామిగౌడ్‌డాక్టర్‌ కేవీ రమణాచారి కళాకారుల కోసమే పుట్టారని తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. గురువారం రవీంద్రభారతి ప్రధాన వేదికపై సత్కళాభారతి ఆధ్వర్యంలో జరిగిన రమణాచారి పుట్టినరోజు వేడుకల్లో స్వామిగౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రమణాచారి జీవితం తెరిచిన పుస్తకమన్నారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకరభారతి స్వామిజీ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత వడ్డేపల్లి కృష్ణ రచించిన, సత్కళాభారతి సత్యనారాయణ దర్శకత్వం వహించిన భాగ్యనగర్‌ చారిత్రక నాటకాన్ని ప్రదర్శించారు. భాగమతి, కులీతుబ్‌షా ప్రేమను చూపిస్తూ సాగిన నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.