అనారోగ్యంతో కన్నుమూత

ఆయన బహుభాషాకోవిదుడు, సాహితీవేత్త

శోకసాగరంలో సాహితీలోకం

వరంగల్‌ కల్చరల్‌: వరంగల్‌ నగర సాహితీ లోకంతో ఐదున్నర దశాబ్దాల అనుబంధాన్ని పెనవేసుకున్న ప్రముఖ కవి, అష్టావధాని, బహుభాషా కోవిదుడు ఇందారపు కిషన్‌రావు(76) మరణించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన పెద్ద కుమారుడు శ్రీనివాసరావు ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య విమలాబాయి, ఇద్దరు కుమారులు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ముగ్గురు కుమార్తెలు కరుణశ్రీ, పద్మశ్రీ, గీతాంజలి ఉన్నారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన ఉదయం టిఫిన్‌ చేసి మాట్లాడుతూనే కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఆదిలాబాద్‌ జిల్లా తాండూరులో జన్మించిన ఆయన ఉద్యోగరీత్యా హన్మకొండ బాలసముద్రంలో స్థిరపడ్డారు. 1970 నుంచి 1987 వరకు వరంగల్‌లోని ఎల్‌బీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా, ఆ తర్వాత పదోన్నతిపై రీడర్‌గా పని చేసి 1999లో ఉద్యోగ విరమణ చేశారు. కిషన్‌రావు 1941 జూలై 4వ తేదీన కమల, కేశవరావు దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. తెలుగుతోపాటు మరాఠీ, సంస్కృతం, ఉర్దూ భాషల్లో మంచి పాండిత్యం ఉంది. ఉస్మానియా నుంచి ఎంఏ, ఆ తర్వాత డాక్టరేట్‌ పొందారు. కిషన్‌రావు వానమామలై వరదాచారికి ప్రియ శిష్యుడు. ఆయన అష్టావధానిగా రాష్ట్రం నలుమూలలా 80కి పైగా అవధానాలను చేసి సాహితీ ప్రియులను మెప్పించారు.

కిషన్‌రావు రచనా వైదుష్యం

కిషన్‌రావు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికా తానా సభల్లోను తన అవధానంతో రంజింపజేశారు. శ్రీనివాస శతకం, రుతు సంహారం, వసంత సుమనస్సులు, కవితా వసంతం, సరస్వతీ వైభవం వంటి రచనలు చేశారు. తాను నిర్వహించిన అవధానాల విశేషాలతో కూడిన అవధాన లేఖ గ్రంథాన్ని ప్రత్యేకంగా ప్రకటించారు. వీటితో పాటు కాకతీయ వైభవం, ప్రతాప రుద్ర వైభవం, సామ్రాట్‌ గణపతి దేవ వంటి దృశ్య రూపకాలను, రామప్ప నృత్య రూపకాన్ని ఇంకా అనేక గేయాలు, నాటికలు రాశారు. కిషన్‌రావు మృతిపై పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కిషన్‌రావు మృతి ఓరుగల్లు సాహితీ లోకానికి తీరని లోటని కవి కోవెల సుప్రసన్నాచార్య అన్నారు. ఇందారపు మృతి తీరని లోటని తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ చెప్పారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు తరలించారు.