కసిరెడ్డి వెంకటరెడ్డికి రాయప్రోలు- వంశీ పురస్కారం 

రవీంద్రభారతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): దేశం, భాష, జాతి కోసం సాహిత్యోద్యమం చేసిన రాయప్రోలు సుబ్బారావు సాహిత్యం తెలంగాణ ఉద్యమంలో ప్రేరణగా నిలిచిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రజల కోసం రాయప్రోలు ఉద్యమిస్తే ఆయన స్ఫూర్తితో తెలంగాణ కోసం తాము ఉద్యమించామని ఆయన తెలిపారు. బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో వంశీఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డికి రాయప్రోలు-వంశీ పురస్కారం-2019 ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందిని సిధారెడ్డి పురస్కారగ్రహీత కసిరెడ్డి వెంకటరెడ్డిని సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాలకు వారధిగా తెలుగు భాష నిలుస్తోందన్నా రు. జాతిని చైతన్యపరిచే కవిత్వాన్ని అందించిన ఘనత రాయప్రోలుదని అన్నారు. దేశభక్తి, స్త్రీ ఔన్నత్యంపై రాయప్రోలు సాహిత్యం అందించారని గుర్తుచేశారు. రాయప్రోలు సుబ్బారావు పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని కసిరెడ్డి వెంకటరెడ్డికి అందజేయడం సముచితమని అన్నారు. వీరిద్దరూ ఉస్మానియా వర్సిటీ తెలుగు శాఖకు అధ్యక్షులుగా పనిచేశారన్నారు. రాయప్రోలు సాహిత్యాన్ని ఈ తరానికి అందించే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు, వంశీరామరాజు, తెన్నేటి సుధాదేవి, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొని కసిరెడ్డి వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించారు. చివరగా కసిరెడ్డి మాట్లాడుతూ రాయప్రోలు పేరిట నెలకొల్పిన పురస్కారం తనకు అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు.