నెల్లూరు, మే4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ గాయని ఎస్‌.జానకిని సోమవారం ఘనంగా సత్కరించారు. నెల్లూరు టౌన్‌హాలులో సోమవారం జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో తన ఎదుగుదలకు జానకి ఆది నుంచి ఎలా తోడ్పాటునందించింది బాలు వివరించారు. తన సినీరంగ ప్రవేశానికి ప్రేరణ కల్పించిన జానకమ్మను సత్కరించుకోవాలని, ఆమె ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతోనే తన పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశానని తెలిపారు. గాయని జానకి మాట్లాడుతూ... చిన్నసాయం చేసిన వ్యక్తిని కూడా మరచిపోకుండా గుర్తుకు తెచ్చుకొని కృతజ్ఞతలు చెప్పడం బాలు సంస్కారానికి నిదర్శనమని అన్నారు. సంగీత సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు వీఏకె రంగారావు, సినీగేయరచయితలు భువన చంద్ర, వెన్నలకంటి, సంగీతదర్శకుడు విద్యాసాగర్‌ తదితరులు మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్‌. జానకిల గాత్ర వైభవాలను కొనియాడారు. కాగా, సత్కారం సందర్భంగా ఇచ్చే లక్ష రూపాయల చెక్కును స్వీకరించడానికి జానకి అంగీకరించకపోవంతో ఆ మొత్తాన్ని హైదరాబాద్‌కు చెందిన స్పైరో స్వచ్ఛంద సంస్థకు అందజేసినట్టు బాల సుబ్రమణ్యం తెలిపారు.