ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం, నవంబరు 4: ప్రముఖ రచయిత, కవి జాతశ్రీ(75) ఇకలేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని విద్యానగర్‌కాలనీ గల స్వగృహంలో అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన అసలు పేరు చార్లెస్‌. జాతశ్రీ 4 కథా సంపుటాలు, 3 నవలలు, నాటికలు రచించారు. సింగరేణిలో పనిచేసిన ఆయన.. సింగరేణి ఇతివృత్తంగా నవలలు, కథలు రాశారు. ఆయన రచించిన కుట్ర అనే కథకు ‘వట్టికోట ఆళ్వార్‌స్వామి’ అవార్డు లభించింది. దీనిని ఆయనకు 2004లో అందజేశారు. ఆయన రచించిన ‘వెదురుపొదలు నినదించాయి’ నవలకు రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. 

అరసం (అభ్యుదయ రచయితల సంఘం)లో జాతశ్రీ ఇప్పటివరకూ కొనసాగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యుదయ రచయితల సంఘానికి కార్యదర్శిగా పని చేశారు. ఆయన మృతికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రచయితలు సంతాపం తెలిపారు. ఆయన మరణం సాహితీ ప్రపంచానికి తీరని లోటని ప్రముఖ కవి, బీసీ కమిషన్‌ సభ్యుడు జూలురు గౌరీశంకర్‌, ప్రముఖ కవులు ప్రసేన్‌, సీతారాం, వంశీకృష్ణ, యన్‌.తిర్మల్‌, రచయితలు హనీఫ్‌, సీహెచ్‌ ఆంజనేయులు, లెనిన్‌ శ్రీనివాస్‌, పి.విద్యాసాగర్‌ అన్నారు. జాతశ్రీకి ముగ్గురు కుమారులు. ఆయన సతీమణి పాల్వంచలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. పదేళ్ల క్రితం మృతి చెందారు.