తెలుగు సభలను ‘నుమాయిష్‌’ గా మారుస్తున్నారు

పరులకు గౌరవం..రాష్ట్ర రచయితలకు అవమానం
జూకంటి జగన్నాథం ఆగ్రహం
 
‘‘ప్రపంచ తెలుగు మహాసభలు వలస వాదుల అడుగు జాడల్లో నడుస్తున్నాయి. పక్క రాష్ట్రంలోని, ప్రపంచంలోని తెలుగు సాహిత్యకారులను ఆహ్వానించి గౌరవించడం మంచిదే కానీ అదే సమయంలో తెలంగాణలోని అనుభవజ్ఞులైన సృజనకారుల పట్ల కనీస మర్యాద పాటించక, ఆహ్వానించక అవమానపరుస్తున్నారు’’ అని అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూకంటి జగన్నాథం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మహాసభల నిర్వహణ తీరుపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు..
 
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న తెలుగు మహాసభలపై కవిగా, రచయితగా మీ స్పందన ఏమిటి?

ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో అనే బదులు భౌగోళిక తెలంగాణలో జరుగుతున్నాయంటేనే సముచితమనుకుంటాను. ప్రపంచంలోని తెలుగు సాహిత్యకారులను ఆహ్వానించి గౌరవించడం మంచిదే. అదే సమయంలో స్వరాష్ట్రంలోని సృజనకారుల పట్ల మర్యాద పాటించక, ఆహ్వానించక అహంతో అవమానపరుస్తున్నారు. ‘తె’ అనే అక్షరం పలుకనివాళ్లంతా ఇప్పుడు పెద్ద గురువులయ్యారు.  

ఈ సభల వల్ల భాషాసంస్కృతులకు ఎంతవరకు మేలు జరుగుతుందనుకుంటున్నారు?

ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల కార్యాచరణను చూస్తే.. కొంచెం అటూ ఇటుగా ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన (1975 -2012) నాలుగు సభలకు పొడిగింపుగానే చూడాలి. ఒక్క పుస్తకం కూడా వెలువరించని సభ్యులు కోర్‌ కమిటీలో కొనసాగుతున్నారు. అనుభవశూన్యుల నేతృత్వంలో జరుగుతున్న సభలతో భాషా సంస్కృతులకు మేలు జరుగుతుందనుకోలేం. 

మహాసభలు సమదృష్టితో జరుగుతున్నాయా?

ఈ సభలు సమదృష్టితో జరుగుతున్నాయని భ్రమిస్తే అది అర్ధ సత్యమే అవుతుంది. మారిన సాహిత్య దృశ్యాన్ని నిర్వాహకులు అంగీకరించే దశలో లేరు. అందుకే కాళోజీ, దాశరథుల నీడను తాకే అర్హత లేనోళ్లకు సత్యనారాయణ వ్రతం నోము పీటలు వేస్తున్నారు. చత్వారం వచ్చిన కండ్లకు సమదృష్టి ఎలా వస్తుంది. సభలను  ‘నుమాయిష్‌’గా మారుస్తున్నారు.

సీఎం మాట్లాడే భాష, పాలన భాషగా రాకపోవడాన్ని ఎలా భావిస్తున్నారు?

ఈ విషయమై జరిగిన వివిధ సమావేశాల్లో కొందరు తెలంగాణ భాషకు ప్రామాణికత, వ్యాకరణాల ప్రస్తావన తెచ్చి ప్రజల భాషను చిన్నచూపు చూశారు. ఇప్పటికీ రెండున్నర జిల్లాల భాషనే ‘కుద్దు’ 31 జిల్లాల భాషగా కొనసాగుతోంది. నిత్యం తెలంగాణ భాష మాట్లాడే ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు సంబంధించిన అంశం ఇది. రాష్ట్ర అధినేత పెద్ద ‘జిద్దు’ మనిషైనా అమలుకు నోచుకోకపోవడం శోచనీయం.

తెలుగు, తెలంగాణ భాషలు వేర్వేరు అంటారా ?

తెలుగు, తెలంగాణ భాషలు ఇప్పుడు ఒకటేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రెండు రాష్ట్రాలలోని తెలుగులో బోలెడు వ్యత్యాసాలు ఉన్నాయి. మూల అచ్చ తెలుగు తెలంగాణదైతే.. ఆంగ్ల, సంస్కృత, తెలుగు హైబ్రిడ్‌ భాష వారిది.  

తెలుగు సభలను విరసం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మీ మాటేమిటి?
గత, ఇప్పటి మహాసభలపై విరసానికి స్పష్టాతి స్పష్టమైన మార్గం ఉంది. ఇకపోతే తెరవే పట్ల అస్పృశ్యతను పాటిస్తున్నది నిర్వాహకులే.