రవీంద్రభారతి, హైదరాబాద్, మే 11(ఆంధ్రజ్యోతి): సమాజాభివృద్ధిలో భాషది కీలక పాత్ర అని ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. తెలుగు భాష పరిరక్షణతో పాటు ఆధునికీకరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాషకు సమగ్ర నిఘంటువు కావాలన్నారు. తెలుగు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ‘తెలంగాణ సాహితి’ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భాషా సాహిత్యోత్సవంలో భాగంగా శుక్రవారం భాషాభివృద్ధి-జరగాల్సిన కృషి అంశంపై సదస్సు జరిగింది. వల్లభాపురం జనార్దన్‌ సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంపాదకులు కె.శ్రీనివాస్‌ కీలకోపన్యాసం చేశారు. తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం కారణంగా తెలంగాణలో ఉద్యమాలు ఉద్భవించాయన్నారు. భాషకు అవమానం జరిగితే సమాజ గౌరవానికి మచ్చ అని అన్నారు. మద్రాసు నుంచి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడేందుకు భాష కారణమైందన్నారు.

నిజాం వ్యతిరేక పోరాటాలు కూడా భాష ప్రాతిపదికన జరిగాయని పేర్కొన్నారు. భాష పరిరక్షణ అంటే ప్రాచీనతను కాపాడుకోవడంతో పాటు ఆధునినీకరించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు ఆలోచించే భాషలోనే బోధన, పాలన ఉన్నప్పుడే భాషాభివృద్ధి జరుగుతుందన్నారు. ఆధునిక భాషగా తెలుగును మార్చుకోవాలన్నారు. ప్రజల వ్యవహారికానికి దగ్గరగా ఉండే ప్రామాణిక భాషను రూపొందించినప్పుడే అది అభివృద్ధి చెందుతుందని కె.శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు ముదిగంటి సుజాతారెడ్డి, ఎం.వేదకుమార్‌, కాలువ మల్లయ్య, షాజాహానా, రమేష్‌, వహీద్‌ఖాన్‌, రాములు పాల్గొన్నారు. అనంతరం భాషా సాహిత్యం- మహిళలు, తెలంగాణ భాష, సాహిత్య వికాసం అంశాలపై ప్రసంగాలు నిర్వహించారు. పురిమల్ల సునంద, కొల్లాపురం విమల, జూపాక సుభద్ర, కొండేపూడి నిర్మల, నస్రీన్‌ఖాన్‌, తంగిరాల చక్రవర్తి, పింగళి చైతన్య, మామిడి లింగయ్య, మోహన్‌ కృష్ణ పాల్గొన్నారు.