ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్‌

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 11: మహిళా కోణంలో వార్తలను చూసే దృష్టి మీడియాలో పెరగాల్సి ఉందని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్‌ అన్నారు. తిరుపతిలో 2రోజులుగా జరుగుతున్న ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) నాలుగవ మహాసభల ముగింపు సమావేశంలో ఆదివారం ఆయన ప్రసంగించారు. వివిధ అంశాలపై వస్తున్న వార్తలు మహిళాకోణాన్ని ప్రతిబింబిస్తున్నాయా లేదా చూడాలని సూచించారు. ఉదాహరణకు బడ్జెట్‌ ప్రకటించగానే అది మహిళలకు ఏవిధంగా మేలు చేస్తుంది అనే కోణంలో వార్త రాయవలసిన అవసరం ఉందని, అన్ని రంగాల్లో మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్‌ వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. మీడియాలో మహిళల వార్తలను సంఖ్యతో కాకుండా దృక్పథాన్ని బట్టి చూడాలని చెప్పారు. సున్నితమైన సామాజిక అంశాలను మహిళా జర్నలిస్టులే సమర్ధంగా రాయగలరన్నారు. సమావేశంలో భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి సమాపన ప్రసంగం చేశారు. గడిచిన దశాబ్ధ కాలంలోనే చారిత్రాత్మక కృషిని ప్రరవే చేపట్టిందన్నారు.

మరింత నిర్మాణాత్మకంగా రచయిత్రులను చేరదీసి, మహిళలకు, ప్రజలకు అవసరమైన అవగాహనను, చైతన్యాన్ని అందించాలని ఆమె కోరారు.ప్రరవే నూతన కార్యవర్గం ఎన్నికమహాసభల సందర్భంగా ప్రరవే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్ష, కార్యదర్శులుగా అనిశెట్టి రజిత, డాక్టర్‌ కేఎన్‌ మల్లీశ్వరి, సమన్వయకర్తగా భండారు విజయ, కోశాధికారిగా రెహానా ఎన్నికయ్యారు. ప్రరవే ఏపీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా డాక్టర్‌ పుట్ల హేమలత, పి.రాజ్యలక్ష్మి, సమన్వయకర్తగా హైమావతి, కార్యవర్గ సభ్యులుగా నల్లూరి రుక్మిణి, విష్ణుప్రియ ఎన్నికయ్యారు. తెలంగాణా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా తిరునగరి దేవకీదేవి, ప్రొఫెసర్‌ కాత్యాయనీ విద్మహే, సమన్వయకర్తగా శాంతి ప్రబోధ, కార్యవర్గ సభ్యులుగా ఎండ్లూరి మానస, పద్దం అనుసూయను ఎన్నుకున్నారు.